మొంథా ఎఫెక్ట్.. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు బంద్.. ఈ రూట్లలో వెళ్తే సేఫ్

మొంథా ఎఫెక్ట్.. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు బంద్.. ఈ రూట్లలో వెళ్తే సేఫ్

మొంథా తుఫాన్ ఆంధ్రతో పాటు తెలంగాణలోనూ బీభత్సం సృష్టిస్తోంది. వాయుగుండం తెలంగాణకు దగ్గరగా కదులుతుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (అక్టోబర్ 29) ఉదయం నుంచి విరామం లేకుండా కురుస్తున్న వానలకు హైదరాబాద్ - శ్రీశైలం రహదారి కోతకు గురైంది. దీంతో హైవేపై రాకపోకలు నిలిపివేశారు.

భారీ వర్షానికి నాగర్ కర్నూల్ జిల్లాలోని డిండి - హాజీపూర్ మధ్య  కాజ్ వే కోతకు గురైంది. దీంతో హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై  రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి వస్తున్న వాహనదారులు హాజీపూర్ సమీపంలో నిలిచిపోవాల్సి వస్తోంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు డిండి దగ్గర ఆగాల్సి వచ్చింది. 

ఈ రూట్లలో వెల్లడం సేఫ్:

శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు అచ్చంపేట, బల్మూర్, లింగాల, తెల్కపల్లి, నాగర్ కర్నూల్ దారిని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. అచ్చంపేట-తెల్కపల్లి మధ్య తుమ్మన్ పేట చెరువు తెగడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయినందున అచ్చంపేట నుంచి బల్మూరు మీదుగా వెళ్లాల్సిందిగా సూచించారు. 

కొందరు వాహనదారులు హాజీపూర్ నుంచి చింతపల్లి, కొండారెడ్డి పల్లి మీదుగా కల్వకుర్తి దగ్గరలో హైవేకు కలుస్తున్నారు. కానీ వర్షం కారణంగా ఆ రూట్ అంత సేఫ్ కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.