ఈ రోజుల్లో తలనొప్పి అనేది చాలా మందిని వేధించే సమస్య. మనలో ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక సమయంలో ఒత్తిడికి లోనవుతుంటాం. తలనొప్పి నుంచి బయటపడేందుకు వెంటనే మాత్రలు వేసుకుంటాం. ఇలా మాత్రలు వేసుకోవడం కంటే కొన్ని సహజమైన, సులభమైన ఇంటి చిట్కాల ద్వారా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .
తలనొప్పి అనేది సర్వసాధారణం అయిపోయింది. దాని బారిన పడని వాళ్లు అంటూ లేరేమో అనిపిస్తుంది. కొద్దిగా అలసిపోయినా, ఎక్కువ పని చేసినా, ఆలోచనలు ఇబ్బంది పెట్టినా.. కోపం వచ్చినా, నిద్ర పట్టకపోయినా. తలనొప్పి రావచ్చని డాక్టర్లు చెప్తారు. కానీ నిజానికి తలలో ఉన్న రక్తనాళాలు ఎక్కువ స్ట్రెస్ కు గురైతే తలనొప్పి వస్తుంది. కాబట్టి తలనొప్పిని తేలిగ్గా తీ సుకోకూడదు. ఎక్కువ రోజుల నుంచినొప్పి వస్తున్నా, భరించలేనంతగా ఉన్నా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే. ఒక్కోసారి కళ్లు ఎక్కువ ఒత్తిడికి గురయినా తలనొప్పి రావచ్చు.
పది నుంచి పదిహేను నిముషాల పాటు చేతులు కాళ్లు క్రమమైన పద్ధతిలో ఊపితే సాధారణ నొప్పి అయితే తగ్గుతుంది. అలాగే బ్రౌన్ కాగితాన్ని వెనిగర్ లో ముంచి నుదిటి మీద పదినిముషాలు ఉంచుకోవటం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకప్పుడు యూకలిప్టస్ ఆకులకు ఆముదం రాసి నుదుటికి రెండువైపులా పెట్టుకునే వాళ్లు. ఐస్ ప్యాక్ పెట్టుకున్నా కొంతవరకు నొప్పి నుంచి బయటపడొచ్చు.
తలనొప్పి బాగా అనిపిస్తే గోరువెచ్చని నీటితో తల స్నానం చేసినా తగ్గొచ్చు. బొటన వేలుకు, చూపుడు వేలుకు మధ్య రెండు నుంచి మూడు నిముషాల పాటు నొక్కి ఉంచినా తలనొప్పి తగ్గుతుంది. ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గకపోతే వైద్యుడిని కలవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వెలుగు,లైఫ్
