చైనాతో అమెరికా డీల్.. సుంకాలను 10 శాతం తగ్గించిన ట్రంప్

చైనాతో అమెరికా డీల్.. సుంకాలను 10 శాతం తగ్గించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం చైనాపై విధించిన సుంకాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో చైనాపై అమలులో ఉన్న టారిఫ్‌లు 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గించబడతాయి. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కీలక మలుపు తిప్పాయి. అంటే చైనాపై సుంకాలు 10 శాతం మేర తగ్గినట్లయింది. 

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో దక్షిణ కొరియాలోని బుసాన్‌లో సమావేశమైన తర్వాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఫెంటనిల్‌పై ఉన్న సుంకాలను కూడా 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించనున్నట్టు తెలిపారు. అలాగే రేర్ ఎర్త్‌లపై ఉన్న సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయన్నారు. చైనా వాటిని సాఫీగా సరఫరా చేస్తుందని చెప్పారు. అమెరికా- చైనా దీనికోసం వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. రేర్ ఎర్త్‌ల విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవని ట్రంప్ చెప్పారు.

ALSO READ : ఫెడ్ నిర్ణయంతో సెన్సెక్స్ నిఫ్టీ క్రాష్..

ట్రంప్ తన సమావేశాన్ని "అద్భుతం" అని వర్ణిస్తూ.. “షీ జిన్‌పింగ్ గొప్ప నాయకుడని.. కఠినమైన చర్చాకర్త” అని ప్రశంసించారు. తాము చర్చల్లో అనేక ముఖ్యమైన అంశాలపై అంగీకారానికి వచ్చినట్లు ట్రంప్ చెప్పారు. చైనా పెద్ద మొత్తంలో సోయాబీన్ అమెరికా నుంచి కొనుగోలు చేయనుందని ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.   

రెండవసారి వైట్ హౌస్‌లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ చైనాపై 100 శాతం సుంకాలు విధించే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఆగ్రహానికి చైనా రేర్ ఎర్త్ ఎగుమతులకు పరిమితులు విధించడం కారణంగా నిలవటంతో ప్రస్తుతం చర్చలు కీలకంగా మారాయి. మెుత్తానికి అమెరికా-చైనాల మధ్య చర్చలు ఫలప్రదంగా మారాయి. దీని ఫలితంగా నవంబర్ 1 నుంచి అమలులోకి రావాల్సిన 100 శాతం సుంకాల బెదిరింపు ఉపసంహరించబడే అవకాశం ఏర్పడింది.