ఇప్పుడిప్పుడే చలి స్టార్ట్ అవుతోంది.. ఈ టైంలో వేడి వేడిగా తినాలనుకుంటాం. అప్పటికప్పుడు వేడిగా చపాతీలూ, రోటీలూ, ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకుని.. వాటిల్లోకి మసాలా కూరలు ఉంటే ఎంచక్కా లాగించేయచ్చు. అందుకే ఈ గ్రేవీ కూరల్ని ట్రై చేసి చూడండి..
మిర్చీ కా సాలన్ తయారీకి కావల్సినవి
- పెద్దమిర్చి: 6
- నూనె : 2 టేబుల్ స్పూన్లు
- చింతపండు గుజ్జు: 1 టేబుల్ స్పూన్
- కారం : 1 టీస్పూన్
- పసుపు: కొంచెం
- ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర: 1 టీ స్పూన్
- ఆవాలు: 1 టీస్పూన్
- ఎండుమిర్చి : 3
- ఉల్లిపాయ పేస్ట్: అర కప్పు
- అల్లంవెల్లుల్లి పేస్ట్: 2 టీ స్పూన్లు
- పల్లీలు: 50 గ్రాములు
- నువ్వులు: 1 టీస్పూన్
- లవంగాలు: 3
- దాల్చిన చెక్క: చిన్న ముక్క
- కరివేపాకు : 2 రెమ్మలు
- కొత్తిమీర తరుగు కొంచెం
- కొబ్బరి తురుము : 2 టేబుల్ స్పూన్లు
- మిరియాలు కొన్ని
- ఉప్పు: తగినంత
తయారీ విధానం : ముందుగా పచ్చిమిర్చిని నూనెలో బాగా వేగించి చేసుకుని పక్కన పెట్టాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, పల్లీలు, కొబ్బరి తురుము, మిరియాలు, నువ్వులు అన్నీ వేగించి మిక్సీ పట్టుకుని ముద్దలా చేయాలి. ఒక పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, లవంగాలు, కరివేపాకు, ఉల్లిపాయల పేస్ట్ వేసి మూడు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత ముందు చేసుకున్న మసాలా ముద్ద కూడా వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి. అందులో చింతపండు గుజ్జు కూడా వేసి గ్రేవీ దగ్గరపడే వరకు ఉడికించాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న మిర్చి వేసి కలిపి రెండు నిమిషాలు తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి.
పంజాబీ దమ్ ఆలూ తయారీకి కావాల్సినవి
- బేలీ ఆలూ : 15 (బాయిల్ చేసుకోవాలి)
- ఉల్లిపాయ ముక్కలు: 1 కప్పు
- పెరుగు: అర కప్పు
- బిర్యానీ ఆకు: 1
- కారం: 1 టీస్పూన్
- పసుపు కొంచెం
- అల్లంవెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
- ధనియాలు : 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర: అర టీస్పూన్
- యాలకులు: 2
- దాల్చిన చెక్క చిన్న ముక్క
- లవంగాలు: 4
- జీడిపప్పు 10
- కసూరీ మేతి: అర టీస్పూన్
- నూనె: సరిపడనంత
- కొత్తిమీర: కొంచెం
- ఉప్పు: తగినంత
- ఇంగువ: చిటికెడు
తయారీ విధానం : ఒక పాన్ లో కొంచెం నూనె వేసి వేడయ్యాక ఉడకబెట్టుకున్న ఆలూను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు అన్నీ కలిపి పొడిచేసిపెట్టాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి ఇంగువ, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు, మూడు నిమిషాలు వేగించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి. ఆ మిశ్రమంలో ముందు చేసిపెట్టుకున్న మసాలా పొడి వేసి నిమిషం వేగిన తర్వాత పెరుగు వేసి కలపాలి. తర్వాత పసుపు, కారం వేసి నూనె తేలేవరకు ఉడికించాలి. తర్వాత ఆలూ, కసూరీ మేతి, ఉప్పు వేసి రెండు నిమిషాలు బాగా ఉడకించుకోవాలి. ఇపుడు అర కప్పు నీళ్లు పోసి కలుపుకుని గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి.
వెలుగు,లైఫ్
