క్రికెట్ లో కొన్ని రికార్డ్స్ బద్దలు కొట్టడం చాలా కష్టం. ఈ లిస్ట్ లో ముఖ్యంగా అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా ఉంటుంది. మూడు ఫార్మాట్ లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ బద్దలు కొట్టడం అత్యంత కష్టం. టెస్టుల్లో లారా 400 పరుగులు.. వన్డేల్లో రోహిత్ 264 పరుగులు.. టీ20ల్లో ఫించ్ 172 పరుగుల వ్యక్తిగత రికార్డ్స్ ఇప్పటికీ సేఫ్ గా ఉన్నాయి. వీటిలో లారా రికార్డ్ రెండు దశాబ్దాలకు పైగా ఎవరు బద్దలు కొట్టలేకపోయారు. ఈ ఏడాది సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ 367 పరుగులు చేసి లారా రికార్డుకు చేరువలోకి వచ్చినా ఇన్నింగ్స్ డిక్లేర్ ఇవ్వడంతో ఈ విండీస్ దిగ్గజ క్రికెటర్ సేఫ్ గా మిగిలింది.
వన్డేల్లో రోహిత్ శర్మ నెలకొల్పిన 264 పరుగుల వ్యక్తిగత స్కోర్ 12 ఏళ్ళైనా చెక్కు చెదరలేదు. రోహిత్ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ రాలేకపోయారు. 2015 వన్డే వరల్డ్ కప్ లో మార్టిన్ గప్టిల్ 237 పరుగులు చేసిన దగ్గరకు వచ్చినా రికార్డ్ మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు. టీ 20 విషయానికి వస్తే ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆరోన్ ఫించ్ 172 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ సేఫ్ గానే ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ హాజరథుల్లా జాజాయ్ 162 పరుగులు చేసి ఫించ్ రికార్డుకు చేరువగా వచ్చాడు. ఫించ్ రికార్డ్ బ్రేక్ అవ్వడం కూడా దాదాపు కష్టమే. ఈ మూడు రికార్డ్స్ లో తన రికార్డ్ బద్దలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోన్ ఫించ్ అన్నాడు.
సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్‌లో తన అత్యధిక పరుగుల రికార్డ్ బద్దలయ్యే అవకాశం ఉందని ఫించ్ తెలిపాడు. ఫించ్ మాట్లాడుతూ.. " 2026 టీ20 వరల్డ్ కప్ లో నా అత్యధిక పరుగుల రికార్డ్ బద్ధలవుతుందని నేను నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇండియాలో మంచి బ్యాటింగ్ వికెట్లు ఉంటాయి. ఆటగాళ్ల ప్రస్తుత సామర్ధ్యం నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి". అని ఫించ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ఒకవేళ ఫించ్ రికార్డ్ బద్దలు కొట్టాలంటే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు ఇంగ్లాండ్ ఓపెనర్లు బట్లర్, పిల్ సాల్ట్ కు మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఉంది.
2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలిసారిగా 20 జట్లు తలపడబోతున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు 17 జట్లు అర్హత సాధించాయి. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కన్ఫర్మ్ కాగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
