తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ( అక్టోబర్ 29 ) కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. 16 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేయగా.. రాబోయే 24 గంటలు అంటే.. అక్టోబర్ 30వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని జనాన్ని అప్రమత్తం చేసింది వెదర్ డిపార్ట్ మెంట్.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్:
సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్:
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్:
కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
హైదరాబాద్ పరిస్థితి ఇది...
హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి చాలా చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సిటీలో ఉదయం, సాయంత్రం సమయాల్లో మామూలుగానే ట్రాఫిక్ జాం ఉంటుంది. ఇక వర్షం పడితే.. పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుధవారం ( అక్టోబర్ 29 ) ఉదయం నుంచి వర్షంతోపాటు భారీ ట్రాఫిక్ జాం అయ్యింది. అయితే.. సాయంత్రానికి హైదరాబాద్ లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని.. రాత్రి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
►ALSO READ | మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. సికింద్రాబాద్ మీదుగా వెళ్లే 133 రైళ్లు రద్దు..
