బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రామాయణ' (Ramayana). ఈ మూవీ తొలి ప్రోమో విడుదలతోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పౌరాణిక గాథలో, రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, లారా దత్త కైకేయిగా నటిస్తున్నారు.
అయితే, ఇందులో నటించే నటుల పాత్రలపై తరుచూ ఏదోరకంగా కాంట్రవర్సీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మొన్నటివరకు సీత పాత్రలో సాయి పల్లవి సెట్ అవ్వలేదంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే రాముడు పాత్రలో, రణబీర్ ఎంపిక సరైనది కాదంటూ విమర్శలు వస్తున్నాయి. రణబీర్ గత వివాదాలను ఎత్తి చూపుతూ నెటిజన్లు మరియు సోషల్ మీడియా ట్రోలర్స్ తరచుగా కామెంట్స్ చేస్తున్నారు.
లేటెస్ట్గా రణబీర్పై జరుగుతున్న ట్రోల్స్‌పై ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ రియాక్ట్ అయ్యారు. ఇటీవల నిర్మాత నమిత్ మల్హోత్రా జరిగిన ఇంటర్యూలో సద్గురు మాట్లాడుతూ.. రాముడిగా రణ్‌బీర్ ఎంపికను సమర్థించారు.
‘‘రామాయణంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ఎలా నటించగలరని? నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే, అలా ట్రోల్ చేయడం అన్యాయం. గతంలో రణ్‌బీర్ అలాంటి పాత్రలు చేశాడు. ఇప్పుడు ఇలాంటి పాత్ర చేయడానికి వీల్లేదనడం అన్యాయమైన తీర్పు. భవిష్యత్తులో రాముడి పాత్ర చేయాల్సి వస్తుందని అతడికి తెలియదు కదా.. రేపు ఇంకో సినిమాలో రావణుడిగా నటించవచ్చు. అప్పుడూ కూడా ఇలానే ట్రోల్స్ చేస్తారా? అలా నటుడి యొక్క పాత్రను వక్రీకరించి మాట్లాడటం సరైన పద్ధతి కాదని’’ సద్గురు వెల్లడించారు.
అలాగే ఈ సినిమాలో రావణుడిగా నటిస్తున్న యశ్ పాత్రపై మాట్లాడుతూ.. ‘యశ్ అందమైన, తెలివైన వ్యక్తి.. దేశంలో చాలా ప్రతిభావంతుడైన సూపర్ స్టార్గా ఆడియన్స్ చేత చాలా ప్రేమించబడ్డాడు. రావణుడి అన్ని ఛాయలను, అతని భక్తిని, అతని లోతును.. అది యష్ మాత్రమే చేయగలడు’ అని సద్గురు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ 'రామాయణ' రెండు భాగాలుగా తెరకెక్కనుంది. పార్ట్ 1 దీపావళి 2026లో విడుదల కానుండగా, పార్ట్ 2, 2027లో విడుదల కానుంది. ఈ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధికం. అంతేకాకుండా ఈ చిత్రానికి సంగీతం కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ హాన్స్ జిమ్మర్ కలిసి పనిచేయడం భారతీయ సినీ చరిత్రలోనే ఇది మొదటిసారి. హాన్స్ జిమ్మర్ బాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడంతో, సంగీత ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'రామాయణ' కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, భారతీయ సినీ పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, భవిష్యత్ చిత్ర నిర్మాణాలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
