అప్పు కావాలంటున్న బల్దియా

అప్పు కావాలంటున్న బల్దియా

హైదరాబాద్, వెలుగు: బల్దియా మళ్లీ అప్పు చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే  రూ.4,590 కోట్లు బాకీ ఉండగా,   ప్రస్తుతం మరో రూ.860 కోట్లకు బ్యాంకుల వైపు చూస్తోంది. ప్రతి ఏటా నిధులు కోసం బల్దియా ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇవ్వట్లేదు.  దీంతో  అప్పులు చేసి నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో సందర్భంలో ఎంప్లాయీస్​ శాలరీలు కూడా టైమ్ కి అందించని  స్థితికి చేరుకుందంటే, ఆర్థికంగా ఎంత దివాలా తీసిందో తెలుస్తోంది.  చేసిన అప్పులకే  రోజూ రూ. కోటికి పైగా వడ్డీ చెల్లిస్తోంది.  బల్దియా చేపట్టిన ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి నయాపైసా రాకపోతుండగా పనులను పూర్తి చేసేందుకు అప్పులు చేయక తప్పడం లేదు. ఏ బడ్జెట్​లోనూ ఆశించిన స్థాయిలో బల్దియాకు సర్కార్ నిధులను కేటాయించట్లేదు. నిధులు ఇవ్వకపోతుండడమే కాకుండా మరిన్ని ప్రాజెక్టులను అమ‌‌‌‌లు చేయాలంటూ బ‌‌‌‌ల్దియాపై భారం పెడుతోంది. దీంతో జీతాలు ఒకవైపు, మ‌‌‌‌రో వైపు మెయింటెనెన్స్ పనులను చేయడం కూడా క‌‌‌‌ష్టంగా మారింది. ఒకటోతేదీ నుంచి జీతం ఎప్పుడొస్తుందోనని ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. బల్దియా అకౌండ్​లో ఫండ్స్​ లేకపోగా  ఫైనాన్స్ విభాగం అధికారులు  బిల్లుల చెల్లింపులో ఒక‌‌‌‌టికి నాలుగు సార్లు చెక్ చేసుకుని ఇస్తున్నారు.  ఇప్పటికే కాంట్రాక్టర్లకు 6 నెలలుగా  వెయ్యి కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. 

మిగులు బడ్జెట్​తో ఉండగా..  
రాష్ట్ర ఏర్పాటుకు ముందు బల్దియా మిగులు బడ్జెట్​తో ఉంది. ఆ తర్వాత క్రమంగా అప్పుల పాలైంది. రాష్ట్ర బడ్జెట్​లో ప్రత్యేక కేటాయింపులు లేకపోవడమే ఇందుకు కారణం. 2014–15 బడ్జెట్​లో భాగంగా  సర్కార్ రూ.288.14 కోట్లు ఇచ్చింది. 2015–16లో  కేవలం రూ.23 కోట్లతోనే సరిపెట్టింది. 2016–17లో  రూ.1.32 కోట్లే ఇచ్చింది. 2017–18 బడ్జెట్​లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.  2018–19, 2019–20 బడ్జెట్​లలో నిధులే కేటాయించలేదు. 2020–21 బడ్జెట్​లో సిటీ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించినా, అందులో బల్దియాకు కేవలం రూ.17 కోట్లు మాత్రమే కేటాయించింది. 2021–22 లో నిధులను కేటాయించలేదు. ఎప్పటిలాగే ఈసారి కూడా రూ.2,500 కోట్లు కావాలంటూ బల్దియా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో ఎన్నొస్తాయో తెలియాలంటే మరో ఐదు రోజులు ఆగాలి.