స్పెషల్‌‌ ఎడ్యుకేషన్‌‌ టీచర్లకూ టెట్‌‌ మినహాయింపు కుదరదు

స్పెషల్‌‌ ఎడ్యుకేషన్‌‌ టీచర్లకూ టెట్‌‌ మినహాయింపు కుదరదు
  • తీర్పు వెలువరించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: భవితా కేంద్రాల్లో పనిచేస్తున్న స్పెషల్‌‌ ఎడ్యుకేషన్‌‌ టీచర్లకూ టెట్‌‌ (టీచర్‌‌ ఎల్జిబిలిటీ టెస్ట్‌‌) అర్హతను మినహాయించలేమంటూ శుక్రవారం హైకోర్టు స్పష్టం చేసింది. మినహాయింపు కోరుతూ వారు దాఖలు చేసిన మూడు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సెకండరీ గ్రేడ్‌‌ టీచర్, స్కూల్‌‌ అసిస్టెంట్‌‌ టీచర్ల కేడర్లలోని స్పెషల్‌‌ ఎడ్యుకేషన్‌‌ టీచర్ల నియామకంలో టెట్‌‌ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. 

వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం మొహియుద్దీన్‌‌తో కూడిన బెంచ్‌‌ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేంద్ర పునరావాస మండలి (ఆర్‌‌సీఐ) నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక టీచర్లకు టెట్‌‌ అర్హతను నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్‌‌సీటీఈ ప్రకారం ప్రత్యేక టీచర్లకు టెట్‌‌ ఉండాల్సిందేనని, వారికి మినహాయింపు కుదరదని తెలిపారు. ఇరు పక్షాల వాదనలను విన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది.