సినిమా చాన్స్ అంటూ రేప్! ..అనాథ యువతిని బంధించి రెండ్రోజులపాటు నరకం

సినిమా చాన్స్ అంటూ రేప్! ..అనాథ యువతిని బంధించి రెండ్రోజులపాటు నరకం
  • నడవలేని స్థితిలో ఉన్న బాధితురాలిని నడిరోడ్డుపై వదిలేసిన వైనం
  • గాంధీ ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో వెలుగులోకి వచ్చిన దారుణం
  • నిందితులు రితేష్, జిల్లా శ్రీనివాస్‌‌లను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

సినిమా షూటింగ్ ఉందంటూ నమ్మించి తీసుకెళ్లి ఓ అనాథ యువతికి ఇద్దరు యువకులు నరకం చూపించారు. రెండ్రోజులపాటు ఓ గదిలో బంధించి, ఆమెపై ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

జూబ్లీహిల్స్, వెలుగు: సినిమా షూటింగ్ ఉందంటూ నమ్మించి తీసుకెళ్లి ఓ అనాథ యువతికి ఇద్దరు యువకులు నరకం చూపించారు. రెండ్రోజులపాటు ఓ గదిలో బంధించి, ఆమెపై ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మేజర్లు అయిన తర్వాత అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చిన ఇద్దరు యువతులు, చిన్నచిన్న షూటింగ్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

వీరిలో ఒక యువతిని ఈ నెల 14న షూటింగ్ ఉందంటూ జిల్లా శ్రీనివాస్, రితేష్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌‌పై మల్లాపూర్‌‌లోని ఒక గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను నిర్బంధించి, ఒకరి తర్వాత ఒకరు రెండు రోజుల పాటు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని నిందితులు రాపిడో బైక్ బుక్ చేసి జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. నడవలేని స్థితిలో రోడ్డుపై ఉన్న బాధితురాలిని ఆమె స్నేహితురాలు గమనించి, వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో యువతిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. దీనిపై గాంధీ హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘోరానికి ఒడిగట్టిన నిందితులు రితేశ్, జిల్లా శ్రీనివాస్‌‌లను గుర్తించి, బుధవారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు.