- మూడు కార్పొరేషన్లలో 159 ఇందిరమ్మ క్యాంటీన్లు .
- కేవలం 50 చోట్ల మాత్రమే అల్పాహారం
- 7 నెలల క్రితం అమల్లోకి..అన్ని చోట్లా అందుబాటులోకి తెస్తామని ప్రకటన
- మూడు కార్పొరేషన్లలో 159 ఇందిరమ్మ క్యాంటీన్లు
- కేవలం 50 చోట్ల మాత్రమే అల్పాహారం
- ఇక్కడ కూడా రోజూ ఉప్మా, పొంగల్ మాత్రమే..
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీ ఇందిరమ్మ క్యాంటీన్లలో పెడుతున్న బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే, అల్పాహారం పెడుతున్న సెంటర్లలోనూ చెప్పిన మెనూ ఫాలో కావడం లేదు. అయినా, ఈ కేంద్రాలకు జనం క్యూ కడుతూనే ఉన్నారు.
కార్మికులు, చిరుద్యోగులు, స్టూడెంట్స్ మరికొన్ని పేద వర్గాలు ఈ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ల పరిధిలో159 ఇందిరమ్మ క్యాంటీన్లుండగా, 7 నెలల క్రితం రూ.5కే బ్రేక్ఫాస్ట్స్కీంను ఘనంగా ప్రారంభించారు. ఆ టైంలో దశలవారీగా అన్ని క్యాంటీన్లలో అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రకటించినా, ఇప్పటికీ కేవలం 50 సెంటర్లకే పరిమితమైంది. 159 సెంటర్లలో జీహెచ్ఎంసీలో 128, సీఎంసీ, ఎంఎంసీల్లో 31 వరకు ఇందిరమ్మ క్యాంటీన్లుండగా అన్నిచోట్ల మధ్యాహ్న భోజనం అందుతోంది. బ్రేక్ ఫాస్ట్ ను జీహెచ్ఎంసీలోని 29 సెంటర్లు, ఎంఎంసీలో 13, సీఎంసీలోని 6 చోట్ల అందజేస్తున్నారు.
బ్రేక్ ఫాస్ట్‌కు మంచి రెస్పాన్స్
రూ.5కే బ్రేక్ ఫాస్ట్ పెడుతుండడంతో ఉదయం పనులకు వెళ్లే కార్మికులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, వలస కార్మికులు రూ.5 బ్రేక్ఫాస్ట్స్కీం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లను ఆశ్రయిస్తున్నారు. 50 సెంటర్లలో నెలకు 3లక్షల మంది తింటున్నారు. అయితే,159 క్యాంటీన్లలో మధ్యాహ్న భోజనం తింటున్న వారి సంఖ్య దీనికంటే 2 లక్షలు మాత్రమే ఎక్కువ. 50 సెంటర్లలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,61,600 మంది బ్రేక్ఫాస్ట్చేయగా, ఇదే నెలలో 159 సెంటర్లలో మధ్యాహ్న భోజనాన్ని 4,63,830 మంది తిన్నారు. పరిమిత కేంద్రాల్లోనే బ్రేక్ఫాస్ట్పెడుతున్నా మధ్యాహ్న భోజనం కంటే ఎక్కువ స్పందన వస్తోంది.
ప్లేట్‌కు రూ.19..
హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తుండగా, రూ.5 కే టిఫిన్స్ పెట్టడానికి కూడా అదే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. బ్రేక్ ఫాస్ట్ కోసం ఒక్కో ప్లేట్ కి రూ.19 ఖర్చవుతుండగా, ఇందులో రూ. 5 ప్రజల నుంచి, మిగిలిన రూ.14 నేరుగా జీహెచ్ఎంసీ, ఎంసీఎం, ఎంఎంసీలు భరిస్తున్నాయి.
హరేకృష్ణ వర్సెస్ జీహెచ్ఎంసీ
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2013లో అన్నపూర్ణ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత సంఖ్య పెంచుతూ వచ్చారు. ఏండ్ల కిందట ఏర్పాటు చేసినవి కావడంతో చాలా చోట్ల డ్యామేజీ అయ్యాయి. దీంతో పాడై పోయిన క్యాంటీన్ల స్థానంలో రూ.11.43 కోట్లతో జీహెచ్ఎంసీ కొత్తవి ఏర్పాటు చేస్తోంది. ఏడు నెలల క్రితం 60 చోట్ల కొత్త కంటైనర్లు ఏర్పాటు చేయగా, మిగతా వాటిని కూడా మారుస్తామని ప్రకటించారు.
ఈ కొత్త కంటైనర్లు ఏర్పాటు చేసిన దాంట్లో 50 చోట్లనే బ్రేక్ ఫాస్ట్ స్కీం తీసుకువచ్చారు. మిగతా చోట్ల అందుబాటులోకి తెచ్చే టైంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ తో జీహెచ్ఎంస్ కి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే ఆగిపోయాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో పక్క మంచినీటి ఫెసిలిటీ కోసం ట్యాంక్ లు ఏర్పాటు చేసినా వాటర్ బోర్డు నీటి సరఫరా చేయడం లేదని, ఇలా పలు సమస్యలతో 109 సెంటర్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీంను అమలు చేయడం లేదని తెలుస్తోంది.
మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్ అందట్లే
50 ఇందిరమ్మ క్యాంటీన్లలోనూ మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్ అందడంలేదని తెలుస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం సోమవారం మూడు మిల్లెట్ ఇడ్లీలతో సాంబార్, చట్నీతో పాటు పొడి, మంగళవారం మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్చర్, చట్నీ, బుధవారం పొంగల్ తో పాటు సాంబార్ మిక్చర్, గురువారం మూడు ఇడ్లీలతో సాంబార్, చట్నీ, శుక్రవారం పొంగల్ తో సాంబార్, మిక్చర్, శనివారం మూడు పూరీలతో ఆలు కుర్మా ఇవ్వాల్సి ఉండగా, ఈ మెనూ ఫాలో కావడం లేదు. చాలావరకు రోజూ ఉప్మా, పొంగల్ మాత్రమే పెడుతున్నారు.
