నిమిషానికి 95 బిర్యానీలు : ఆన్​లైన్​ ఫుడ్​ ఆర్డర్లలో టాప్‌‌

నిమిషానికి 95 బిర్యానీలు : ఆన్​లైన్​ ఫుడ్​ ఆర్డర్లలో టాప్‌‌

స్వీట్లలో గులాబ్​జామూన్​ టాప్​.. స్విగ్గీ యాన్యువల్ ​రిపోర్టు-2019లో వెల్లడి

ఇండియన్స్​ఫేవరేట్​డిష్‌‌గా చికెన్‌‌ బిర్యానీ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రముఖ ఫుడ్​డెలివరీ యాప్ స్విగ్గీలో నిమిషానికి 95 ఆర్డర్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. ఈ ఘనత సాధించింది. స్విగ్గీ తన యాన్యువల్​రిపోర్టు–2019లో దీన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ ​వరకు అందిన ఆర్డర్ల ఆధారంగా రూపొందించిన ఈ రిపోర్టులో ఇండియన్స్‌‌ ఫుడ్‌‌ ఇంట్రెస్ట్‌‌లకు సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి.

హైదరాబాద్​ అనగానే గుర్తొచ్చేవి.. ఒకటి చార్మినార్​, రెండు బిర్యానీ. హైదరాబాద్​ బిర్యానీకి ఉన్న ఆ క్రేజే వేరు. ఒక్క హైదరాబాదే కాదు, ఇప్పుడు ఇండియన్లంతా బిర్యానీనే కావాలంటున్నారు. వేడివేడిగా పొగలు కక్కే బిర్యానీ నోట్లో పడితే ఆ టేస్టే వేరప్పా అంటున్నారు. రెస్టారెంట్​కెళ్లి మెనూ కార్డ్​ చూసినా, ఫుడ్​ డెలివరీ యాప్​లు ఓపెన్​ చేసినా చాలా మంది వేళ్లు, కళ్లు బిర్యానీ దగ్గరే ఆగిపోతున్నాయి. టక్కున ఆర్డర్​ పెట్టేస్తున్నాయి. ఇప్పుడు స్విగ్గీ విడుదల చేసిన యాన్యువల్​ ‘స్టాట్​ఈటిస్టిక్స్​’ రిపోర్టు కూడా అదే చెబుతోంది. ఎక్కువ మంది బిర్యానీకే ఓటేస్తున్నారని చెప్పింది. ఇండియన్ల ఫేవరెట్​ డిష్​గా మారిపోయిందంటోంది. దేశంలో నిమిషానికి సగటున 95 (సెకనుకు 1.6) ఆర్డర్లు బిర్యానీవే ఉన్నాయంటోంది. ఆ బిర్యానీల్లో ఎక్కువ ఆర్డర్లతో ‘చికెన్​ బిర్యానీ’ కింగ్​గా నిలిచింది. ఈ ఏడాది రిలీజ్​ చేసిన నాలుగు రిపోర్టుల్లోనూ బిర్యానీనే టాప్​గా నిలిచింది. బిర్యానీ తర్వాత దక్షిణాదోళ్లు ఎక్కువగా ఇష్టపడే మసాల దోష రెండో ర్యాంకును దక్కించుకుంది. చికెన్​ ఫ్రైడ్​ రైస్​, మటన్​ బిర్యానీలు టాప్​5లో చోటు దక్కించుకున్నాయి. పుణెలోని చికెన్​సజుక్​బిర్యానీ (రూ.1,500) ఖరీదైన బిర్యానీగా, ముంబైలోని తవా బిర్యానీ (రూ.19) పాకెట్​ఫ్రెండ్లీ బిర్యానీగా నిలిచాయి.

స్వీట్లలో గులాబ్​జామూన్​ రారాజు

డిజర్ట్​లలో గులాబ్​జామూన్​ రారాజుగా నిలిచింది. దేశమంతటా ఈ ఏడాది 17,69,399 ఆర్డర్లు గులాబ్​జామూన్​వే. ఈ ఏడాది లిస్టులో కొత్తగా ఫలూడాచేరింది. డిజర్ట్​లలో టాప్​2 ప్లేస్​ను దక్కించుకుంది. ఈ ఏడాది మొత్తంగా 11,94, 732 ఆర్డర్లు ఫలూడావే. ఒక్క ముంబైలోనే 6 వేల సార్లు ఫలూడాను ఆర్డర్​ చేశారు. ఆ తర్వాత చాకో పై అండ్​ డ్రింక్​ను ఒక్క చండీగఢ్​లో 79,242 సార్లు ఆర్డర్​ చేశారు. మొత్తం 3 లక్షల కేక్​ ఆర్డర్లు రాగా, అందులో టాప్​లో నిలిచింది బ్లాక్​ ఫారెస్ట్​. డెత్​ బై చాక్లెట్​, టెండర్​ కోకోనట్​ ఐస్​ క్రీం, తిరమిసు ఐస్​ క్రీమ్​, కేసర్​ హల్వాలనూ జనం ఎక్కువగా ఆర్డర్​ చేశారు. ఇటు కిచిడీకి ఫ్యాన్లు పెరిగిపోయారు. ఈ ఏడాది దాని ఆర్డర్లు 128 శాతం పెరిగాయి. మేతి మలాయ్​ పనీర్​, ధాబా దాల్​ విత్  రైస్​, చపాతీస్​ థాలి, గోబి మటర్​ మసాలా, దాల్​ మఖానీ విత్​ జీరా రైస్​, మినీ దోసె, ఇడ్లీ, వడ, సాంబార్​ థాలిలకు డిమాండ్​ పెరిగింది.

ఆరోగ్యంపై శ్రద్ధ

ఫుడ్​ ఆర్డర్​ పెట్టేటోళ్లు ఆరోగ్యంపైనా శ్రద్ధ పెడుతున్నట్టు స్విగ్గీ రిపోర్టులో తేలింది. మొత్తం ఆర్డర్లలో 3.5 లక్షల ఆర్డర్లు హెల్త్​ను దృష్టిలో పెట్టుకునే ఇచ్చారు. అందులో భాగంగా కీటో ఫుడ్డుకు ఓటేస్తున్నారు జనం. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది కీటో ఫుడ్డు ఆర్డర్లు 306 శాతం పెరిగాయి. కీటో బ్రౌనీస్​, కీటో ఫ్రెండ్లీ టస్కన్​ చికెన్​, హెల్దీ రెడ్​ రైస్​ పోహా వంటి వాటిని జనం ఆర్డరిచ్చారు. అన్నింట్లోనూ కీటో బ్రౌనీస్​ను ఎక్కువగా ఆర్డరిచ్చారు. అంతేకాదు, గోమూత్రాన్నీ కొందరు ఆర్డరిస్తున్నట్టు తేలింది.

గుంటూరు నుంచి ఎక్కువ ఆర్డర్లు

ప్రస్తుతం 530 సిటీల్లో స్విగ్గీ ఫుడ్డును డెలివరీ చేస్తోంది. ఈ ఏడాది కొత్తగా వరంగల్​, గుంటూరు, వైజాగ్​, మదురై వంటి సిటీలను లిస్టులో చేర్చింది. లాంచ్​చేసిన వారం రోజుల్లోనే రోజూ సగటున వెయ్యి ఆర్డర్లు ఆయా సిటీల నుంచి వస్తున్నాయి. ఏపీలోని గుంటూరు నుంచి రోజూ 2,500కు పైగా ఆర్డర్లు వస్తున్నట్టు స్విగ్గీ రిపోర్టు తేల్చింది. ఫుడ్డును అందించే డెలివరీ గర్ల్స్​లో కొచ్చికి చెందిన సుధ రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది మొత్తం ఆమె 6,838 ఆర్డర్లను అందించారు. మొత్తం వెయ్యి మందికిపైగా మహిళలు స్విగ్గీ ఫుడ్​ డెలివరీ పార్ట్​నర్స్​గా ఉన్నారు.