
- అత్యధికంగా హైదరాబాద్‌లో 29 వేల కేసులు పరిష్కారం
- 4,539 మంది సైబర్ క్రైమ్ బాధితులకు రూ.12.94 కోట్లు రీఫండ్
హైదరాబాద్, వెలుగు: కేసుల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న జాతీయ మెగా లోక్ అదాలత్ మంచి ఫలితాలను ఇస్తున్నది. ఈ ఏడాది ఇప్పటికే రెండు మెగా లోక్ అదాలత్‌లు నిర్వహించగా, శనివారం మూడోది నిర్వహించారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 1,65,522 కేసులను పరిష్కరించినట్టు డీజీపీ జితేందర్ తెలిపారు. వీటిలో కాంపౌండబుల్ అఫెన్సెస్ (పరిష్కరించబడేవి) కేసులు 20,964, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు 883, ఈ-–పెట్టీ కేసులు 75,430, మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు 61,205, సైబర్ క్రైమ్ కేసులు 7,040 ఉన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
అత్యధికంగా హైదరాబాద్‌లో 29,023 కేసులు పరిష్కారమైనట్టు అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత రాచకొండలో 22,278, నల్గొండలో 14,002, వరంగల్‌లో 10,309, రామగుండంలో 8,358 కేసులు క్లియర్ అయినట్టు తెలిపారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీజీఎల్‌ఎస్‌ఏ), డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ), జిల్లా జడ్జీలు, మేజిస్ట్రేట్‌లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీల సమన్వయంతోనే పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమైనట్టు చెప్పారు.
సైబర్ క్రైమ్ బాధితులకు 321 కోట్లు రీఫండ్..
జాతీయ మెగా లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 4,539 మంది సైబర్ క్రైమ్ బాధితులకు రూ.12.94 కోట్లు రీఫండ్ ఆర్డర్లు ఇచ్చినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని లోక్ అదాలత్‌లలో కలిపి మొత్తం 18,872 మంది బాధితులకు రూ.138.04 కోట్ల రీఫండ్ ఆర్డర్లు అందజేసినట్టు తెలిపారు. అదేవిధంగా లోక్ అదాలత్‌కు ముందు కూడా 2,501 మందికి రూ.27.91 కోట్ల రీఫండ్ చేసినట్టు వెల్లడించారు. మొత్తంగా 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు 36,786 మంది బాధితులకు రూ.321 కోట్లు రీఫండ్ చేసినట్టు చెప్పారు.
సైబర్ క్రైమ్ కేసుల్లో ఈ ఏడాది ఎక్కువగా రీఫండ్ (రూ.కోట్లలో) ఇక్కడే..
పోలీస్ యూనిట్ కేసులు రీఫండ్
సైబరాబాద్ 1,937 11.51
హైదరాబాద్ 941 9.29
రాచకొండ 1,061 6.41
సీఎస్బీ హెడ్ క్వార్టర్స్ 197 4.21
సంగారెడ్డి 266 1.04