
హైదరాబాద్‌కు చెందిన నసీర్ ఖాన్ అనే వ్యాపారవేత్త మెక్‌లారెన్ అనే అరుదైన సూపర్ కారును కొని వార్తల్లో నిలిచారు. భారతదేశంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన765 LT స్పైడర్ ను కొనుగోలు చేసిన మొదటి వ్యక్తిగా నసీర్ ఖాన్ పేరు గడించారు. రూ.12కోట్లు విలువ గల ఈ ఎలక్ట్రిక్ హార్డ్ టాప్ కారు ఓపెన్ కావడానికి 11 సెకన్ల సమయమే పట్టడం దీని ప్రత్యేకతల్లో ఒకటి. కాగా కార్బన్ ఫైబర్‌తో కారు బాడీని తయారు చేయడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ సూపర్ కారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నసీర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కారు ఇటీవలే హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఖాన్ కు డెలివరీ చేయబడింది.
వ్యాపారవేత్తగా రాణిస్తోన్న నసీర్ ఖాన్ కు అరుదైన కార్లను కొని, వాటిల్లో తిరుగుతూ, వాటి పక్కన నిలబడి ఫొటోలకు ఫోజులివ్వడం చాలా సరదా. అయితే ఇప్పటికే అతని గ్యారేజీలో రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్, మెర్సిడీజ్-బెంజ్ జీ350డీ, ఫోర్డ్ ముస్టాంగ్, లాంబోర్గిని అవెంటడార్, లాంబోర్గిని ఉరుస్ లాంటి ఎన్నో ఖరీదైన కార్లు ఉండడం గమనార్హం. ఇక తాజాగా 765 ఎల్టీ స్పైడర్ ను కొన్న తొలి భారతీయ వ్యక్తిగా నసీర్ నిలవడం విశేషం. కాగా మెక్ లారెన్ సంస్థ ఇండియా మార్కెట్ లోకి గతేదాడే వచ్చింది.