సిటీ నుంచి వెళ్తున్న‌ మామిడికాయ‌ల లారీ బోల్తా.. ఐదుగురు వ‌ల‌స కూలీల మృతి

సిటీ నుంచి వెళ్తున్న‌ మామిడికాయ‌ల లారీ బోల్తా.. ఐదుగురు వ‌ల‌స కూలీల మృతి

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న లాక్ డౌన్.. వ‌ల‌స కార్మికులను అష్ట‌క‌ష్టాల్లోకి నెట్టేసింది. ఎక్క‌డిక‌క్క‌డ అన్ని ప‌నులు నిలిచిపోయి.. ఉపాధి లేక‌, తిన‌డానికి తిండి లేక‌, నిలువ నీడ లేక సొంత ఊరు చేర‌లేక అల్లాడిపోతున్నారు. ఇటీవ‌ల వ‌ల‌స కూలీల కోసం శ్రామిక రైళ్లు వేసిన‌ప్ప‌టి.. అవ‌స్థ‌లు తీరడం లేదు. కొంత మంది ఎలాగైనా సొంత ఊరికి చేరాల‌ని వంద‌లాది కిలోమీట‌ర్లు కాలిన‌డ‌క‌న వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘ‌ట‌న‌లు కూడా జ‌రిగాయి. మ‌రోవైపు రెండ్రోజుల క్రితం మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్ లో రైల్వే ట్రాక్ పై నిద్రిస్తున్న వ‌ల‌స కార్మికుల మీద నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లి 16 మంది దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో ఘోరం జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు మామిడికాయ‌ల లోడుతో వెళ్తున్న‌లారీ బోల్తాప‌డి.. ఐదుగురు వ‌ల‌స కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 11 మందికి గాయాల‌య్యాయి. మార్గ‌మ‌ధ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని న‌ర్సింగ్ పూర్ వ‌ద్ద శ‌నివారం అర్ధ‌రాత్రి త‌ర్వాత ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.

ఇద్ద‌రి ప‌రిస్థితి సీరియ‌స్.. కొంద‌రికి క‌రోనా ల‌క్ష‌ణాలు

హైద‌రాబాద్ నుంచి ఆగ్రాకు మామిడికాయ‌ల లోడుతో బ‌య‌లుదేరిన లారీలో కొంత దూరం వెళ్లాక 15 మంది వ‌ల‌స కూలీలు ఎక్కారు. వారంతా హైద‌రాబాద్ లో వ‌ల‌స కార్మికులుగా ఉండి.. లాక్ డౌన్ వ‌ల్ల ప‌నులు లేక‌.. యూపీలోని త‌మ స్వ‌స్థ‌ల‌మైన‌ ఝాన్సీ వెళ్లేందుకు కాలిన‌డ‌క‌న బ‌య‌లు దేరారు. ఆ లారీలో ఎక్కి క‌ష్టం లేకుండా ఊరికి చేరొచ్చ‌ని భావించిన వారిని దుర‌దృష్టం వెంటాడింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని న‌ర్సింగాపూర్ స‌మీపంలోని ప‌తా గ్రామం వ‌ద్ద లారీ అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో అందులో ఉన్నవారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 11 మంది గాయాల‌పాల‌య్యారు. మ‌రో ఇద్ద‌రికి ఎటువంటి గాయాలు లేకుండా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స్థానికులు వారిని స‌మీపంలోని ప్ర‌భుత్వ‌ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

లారీలో ఇద్ద‌రు డ్రైవ‌ర్లు, ఒక క్లీన‌ర్ స‌హా మొత్తం 18 మంది ఉన్నార‌ని న‌ర్సింగ్ పూర్ క‌లెక్ట‌ర్ దీప‌క్ స‌క్సేనా తెలిపారు. 18 మందిలో ఐదుగురు మ‌ర‌ణించ‌గా.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఇద్ద‌రికి త‌ల‌పై తీవ్ర గాయాల‌య్యాయ‌ని, వారి ప‌రిస్థితి క్రిటిక‌ల్ గా ఉండ‌డంతో జ‌బ‌ల్పూర్ కు రెఫ‌ర్ చేశామ‌ని చెప్పారు సివిల్ స‌ర్జన్ డాక్ట‌ర్ అనితా అగ‌ర్వాల్. మిగిలిన వారంతా స్టేబుల్ గా ఉన్నార‌న్నారు. అయితే వ‌ల‌స కూలీల్లో కొంద‌రు జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రంతో మూడు రోజులుగా బాధ‌ప‌డుతున్న‌ట్లు చెప్పార‌ని, దీంతో మృతులు స‌హా మొత్తం అంద‌రి నుంచి క‌రోనా టెస్టుకు శాంపిల్స్ తీసుకున్నామ‌ని తెలిపారు.