మెట్రో బాదుడు .. కనిష్ట ధరల్లో 20 శాతం, గరిష్ట ధరల్లో 25 శాతం పెరగుదల

మెట్రో బాదుడు .. కనిష్ట ధరల్లో 20 శాతం, గరిష్ట ధరల్లో 25 శాతం పెరగుదల

టికెట్ల​ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన హైదరాబాద్​ మెట్రో
 రేపటి నుంచి కొత్త మెట్రో చార్జీలు అమలు..
ఆర్థిక భారంతోనే రేట్లు పెంచుతున్నట్లు అధికారుల ప్రకటన 

హైదరాబాద్, వెలుగు: మెట్రో టికెట్​ధరలు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు గురువారం ప్రకటించారు. ఈ నెల 17 నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఆర్థిక భారంతోనే టికెట్​రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కనిష్టంగా టికెట్ ధర రూ.10 ఉండగా, ఈ నెల17 నుంచి రూ.12కు, గరిష్ట ధర రూ.60 ఉండగా, రూ. 75కు పెరగనున్నాయి. కనిష్ట ధరలో 20 శాతం, గరిష్ట ధరలో 25 శాతం పెంచారు. గతంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా మెట్రో టికెట్ల రేట్లను పెంచారు. అయితే మెట్రో తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం అవుతోంది.  

సంస్థ అప్పులు పెరగడంతో.. 

ప్రస్తుతం మెట్రో సేవలు హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్ఎల్), ఎల్ అండ్ టీ– మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్(ఎంఆర్ హెచ్ఎల్)​ఆధ్వర్యంలో పీపీపీ మోడల్‌‌లో నడుస్తున్నాయి. 2017 నవంబర్ 28న ప్రారంభమైన హైదరాబాద్​మెట్రో 67 కి.మీ. నెట్‌‌వర్క్‌‌తో రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. అయితే, కొవిడ్ టైంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడం, ఆపరేషనల్ ఖర్చులు పెరగడంతో మెట్రో అప్పులు రూ.6,598 కోట్లకు చేరాయి. 

ఆపరేషనల్ ఖర్చులు160 శాతం పెరగడంతో టికెట్ల రేట్లు పెంచక తప్పట్లేదని అధికారులు చెబుతున్నారు. మెట్రో రైల్వే(ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) చట్టం, 2002లోని సెక్షన్ 34 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 5న ఫేర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్​జస్టిస్ గుడిసేవ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన, కేంద్ర ప్రభుత్వం నుంచి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ ఆర్బన్ అఫైర్స్ అడిషనల్ సెక్రటరీ సురేంద్ర కుమార్ బాగ్డే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పటి ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కూడిన కమిటీ 2023 జనవరి 25న నివేదిక సమర్పించింది. కమిటీ సిఫారసులు సెక్షన్ 37 ప్రకారం మెట్రోకు ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ ప్రకారమే కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయి.

ప్రయాణికుల నుంచి విమర్శలు

ఒక్కసారిగా 20 నుంచి 25 శాతం టికెట్ ధరలు పెరగడంతో ప్రయాణికుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా మెట్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన చార్జీలతో సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులను మెట్రో దూరం చేసుకుంటుందని ఓ నెటిజెన్ ఎక్స్ లో పోస్ట్​చేశారు. 2025 ఫిబ్రవరి 9న బెంగళూరు నమ్మ మెట్రో ధరలు పెరిగాయి. గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.90కి పెరిగింది. కానీ ప్రజల నిరసనల తర్వాత ఫిబ్రవరి 14 నుంచి కొన్ని రూట్‌‌లలో గరిష్ట పెంపును 71శాతానికి  తగ్గించారు. 

అయితే ధరల పెంపుతో బెంగళూరులో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 8.2 లక్షల నుంచి 7.1 లక్షలకు(13శాతం) పడిపోయింది. తాజాగా హైదరాబాద్​మెట్రో పెంచిన ధరలు ప్రయాణికుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని, ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సదుపాయం ఉండటంతో మెట్రోకు దూరం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.