
హైదరాబాద్ లోని పలు మెట్రో స్టేషన్లలో టికెట్ లు ఇచ్చే యంత్రాలు మొరాయిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా సాంకేతిక లోపాలు తలెత్తి యంత్రాలు మొరాయించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. మాదాపూర్ తోపాటు పలు స్టేషన్ లలో టికెట్ యంత్రాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టికెట్ల కోసం ప్రయాణికులు భారీ క్యూ లైన్లు కట్టారు.
ఇక నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హఫీజ్ పేట్, బాలానగర్ లో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కూకట్ పల్లి, శేర్లింగంపల్లి వెస్ట్ లో 6.8 సెంటీమీటర్లు.. మియాపూర్, మాదాపూర్, ఆర్సిపురంలో 7.6 సెంటీమీటర్లు.. ఏఎస్ రావు నగర్ లో 7.1 సెంటీమీటర్లు.. మౌలాలిలో 7.2 సెంటీమీటర్లు.. కుత్బుల్లాపూర్ లో 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఖైరతాబాద్ లో 5.4 సెంటీమీటర్లు..చర్లపల్లిలో 5.2 సెంటీమీటర్లు.. బోరబండ యూసఫ్ గూడాలో 5.1 సెంటీమీటర్లు.. జూబ్లీహిల్స్, పాటిగడ్డ, నాంపల్లిలో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన దాదాపు 200 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ చాలా చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. నగరంలోని ప్రధాన రోడ్లపై వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్నారు. రాజేంద్రనగర్ లోని 192 పిల్లర్ వద్ద భారీగా వర్షపు నీళ్లు నిలిచాయి. దీంతో వాటర్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది.