హైదరాబాద్ చుట్టూ మెట్రో : 250 కిలోమీటర్లు లక్ష్యంగా ప్రణాళిక

హైదరాబాద్ చుట్టూ మెట్రో : 250 కిలోమీటర్లు లక్ష్యంగా ప్రణాళిక

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ మెట్రో రైలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. నగరంలో పలు ప్రాంతాలకు మెట్రోను ప్రభుత్వం పొడిగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా హైదరాబాద్  మెట్రో 250 కిలో మీటర్ల నెట్ వర్క్ గా మారనున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం ఎన్ని కి. మీ..

హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడూ మార్గాల్లో నడుస్తోంది. వీటిని రెడ్ లైన్, గ్రీన్ లైన్, బ్లూలైన్లుగా విభజించారు. రెడ్ లైన్ అంటే మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 29 కిలో మీటర్లు.  బ్లూ లైన్ అంటే రాయ దుర్గం నుంచి నాగోల్ వరకు 27 కిలో మీటర్లు. గ్రీన్ లైన్ అంటే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 10.5 కిలో మీటర్లు.  మొత్తం ఈ మూడు కారిడార్లలో 59 స్టేషన్లున్నాయి. మూడు కారిడార్ల పొడవు 66. 5 కిలో మీటర్లు. 

రెండో దశలో 31 కి .మీ

మరోవైపు మెట్రో రెండో దశలో భాగంగా రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో పరుగులు పెట్టనుంది. ఇప్పటికే ఈ పనులు మొదలయ్యాయి. మొత్తం 6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల పొడవున ఈ లైన్‌ను నిర్మిస్తున్నారు. మూడేళ్లలో ప్రభుత్వం ఈ మెట్రో కారిడార్ ను పూర్తి చేయనుంది.  మెట్రో మార్గంలో టౌన్‌షిప్‌లు, ప్రయాణికుల రద్దీ ఆధారంగా మొత్తం 8 నుంచి 9 స్టేషన్లను నిర్మిస్తారు. 

కందుకూరు వరకు మెట్రో పొడిగింపు..

హైదరాబాద్ మెట్రో రైలు శంషాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా కందుకూరు వరకు విస్తరించనుంది. ఈ మేరకు గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.  ప్రజల ప్రయాణ అవసరాల దృష్ట్యా శంషాబాద్ నుంచి మహేశ్వరం నియోజవర్గంలోని కుందుకూర్ వరకు మెట్రో విస్తరించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కారిడార్  దాదాపు 30 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. ఈ లైను 2027లోగా పూర్తయ్యే అవ‌కాశం ఉంది. 

మరో రెండు మార్గాల్లో మెట్రో

హైదరాబాద్ మెట్రోను ప్రస్తుతం ఉన్న  రెండు మార్గాల్లో మరింత దూరం విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. లక్డికాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఐదు కిలోమీటర్లు విస్తరించాలని అనుకుంటోంది. ఈ విస్తరణ పనులకు ఆమోదంతో పాటు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హర్దీప్ సింగ్ పూరిని కలిసి  ప్రతిపాదనను సమర్పించారు.