హైదరాబాద్ లో పూర్తిగా నీట మునిగిన MGBS బస్ స్టాండ్.. వరదలో చిక్కుకుపోయిన ప్రయాణికులు..

హైదరాబాద్ లో పూర్తిగా నీట మునిగిన MGBS బస్ స్టాండ్.. వరదలో చిక్కుకుపోయిన ప్రయాణికులు..

వెలుగు నెట్​వర్క్​: నగరాన్ని వర్షం వదలడం లేదు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు సిటీలోని పలుచోట్ల నాన్​ స్టాప్​ వర్షం కురిసింది. వరదలతో హైటెక్​ సిటీ ఆగమైంది. మియాపూర్​ హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు వద్ద రోడ్డుపై భారీ వరద చేరడంతో బాచుపల్లి నుంచి మియాపూర్​కు రాకపోకలు స్తంభించాయి. మైహోం మంగళ వద్ద గల రైల్వే అండర్​ పాస్​ నీటితో నిండిపోవడంతో కొండాపూర్​ రోడ్డును క్లోజ్​ చేశారు. మియాపూర్​ మదీనగూడ ప్రాణం హాస్పిటల్​ ఎదురుగా జాతీయ రహదారిపై ట్రాఫిక్​ ఏర్పడింది. హెచ్​సీయూ వద్ద ఓల్డ్​ ముంబై హైవే జలమయమైంది. గండిపేట గేట్లు ఎత్తడంతో ఎంజీబీఎస్ ను వరద ముంచెత్తింది. బస్ స్టాండ్ ప్రాంగణం చెరువును తలపించడంతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు.  

హైడ్రా అధికారులు భారీ మోటార్లతో వరదనీటిని తొలగించారు. విప్రో జంక్షన్​ చెరువును తలపించింది. మైక్రోసాఫ్ట్​ కంపెనీలో కాంపౌండ్​ వాల్​ లోపలి నుంచి వర్షపు నీరు అలుగుపోసినట్లుగా రోడ్డుపైకి వచ్చింది. సైబరాబాద్​ సీపీ అవినాష్​ మహంతి ట్రాఫిక్​ ఉన్నతాధికారులతో కలిసి వరద ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం ఇచ్చారు. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ బస్ స్టాప్ చెరువులా మారింది. ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి తెలం గాణ తల్లి ఫ్లైఓవర్ వరకు భారీ ట్రాఫిక్ ఏర్పడింది. మేడిపల్లి నుంచి ఫీర్జాదిగూడ వరకు భారీగా ట్రాఫిక్​ ఏర్పడింది.

ఎంజీబీఎస్​ను ముంచిన వరద

గండిపేట గేట్లు ఎత్తడంతో ఆ వరద మహాత్మా గాంధీ బస్​స్టేషన్​(ఎంజీబీఎస్​)లోకి వచ్చింది. దీంతో బస్టాండ్​ ప్రాంగణం చెరువులా మారింది. ప్రయాణికులు నీటిలో చిక్కుకోగా  హైడ్రా, డీఆర్​ఎఫ్​ బృందాలు బయటికి తీసుకొచ్చాయి.

రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో..

వికారాబాద్​, రంగారెడ్డి జిల్లాలో చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. పరిగి బీసీ కాలనీలో ఇండ్లలోకి నీరు చేరింది. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.