
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల పేర్లు మారుస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చేందుకు వచ్చే నెల 5న ఇక్కడ ఆర్ఎస్ఎస్ మీటింగ్ నిర్వహిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పేరు మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్ మీటింగ్ అవసరం లేదని, తాము బరాబర్ భాగ్యనగరంగా మారుస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే ఈ నిర్ణయం తీసుకుందని, అప్పుడు ప్రచారానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా దీనిపై ప్రకటన చేశారని గుర్తుచేశారు. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లతో పాటు మిగతా నగరాల పేర్లు కూడా మారుస్తామని చెప్పారు. నిజాం సర్కార్ బలవంతంగా మార్చిన పేర్లనన్నింటిని తిరిగి మారుస్తామన్నారు. ఆనాటి నిజాం దౌర్జన్యాలను ప్రజల ముందు పెడతామని, ఆయన చరిత్ర లేకుండా చేసేందుకు అప్పటి కట్టడాలను కూడా ధ్వంసం చేస్తామని తెలిపారు. దేశం కోసం అమరులైన వారి పేర్లను జిల్లాలకు పెడతామని పేర్కొన్నారు.