- 11 శాతం పెరిగిన కిరాయిలు
- కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిపోర్ట్
హైదరాబాద్: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) నుంచి వస్తున్న భారీ డిమాండ్ కారణంగా 2026 మొదటి క్వార్టర్ కాలంలో హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలాల అద్దెలు రికార్డు స్థాయికి చేరాయి. కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ లెక్కల ప్రకారం.. నగరంలో సగటు ఆఫీస్ అద్దె వార్షిక ప్రాతిపదికన 11.6 శాతం పెరిగి చదరపు అడుగుకు నెలకు రూ.92.2 కు చేరింది. ఐటీ హబ్ అయిన మాదాపూర్‌లో ఈ అద్దె అత్యధికంగా రూ.105.5 గా ఉంది. ఇది బెంగళూరు అద్దె రూ.97 ను దాటింది.
ముంబైలో చదరపు అడుగుకు రూ.171 అద్దెతో దేశంలోనే అత్యంత ఖరీదైన మార్కెట్‌గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలాల లీజింగ్ మునుపెన్నడూ లేని విధంగా 21.6 శాతం వృద్ధితో 3.15 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం లీజింగ్‌లో హైదరాబాద్ వాటా 14 శాతంగా ఉంది. కొత్త భవనాల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో మాదాపూర్‌లోని ప్రీమియం గ్రేడ్ ఏ ప్లస్ ఆఫీస్ స్థలాలలో ఖాళీలు కేవలం 4.8 శాతానికి తగ్గాయి.
ఈ క్వార్టర్‌లో జరిగిన లీజింగ్‌లో ఐటీ-–బీపీఎం సంస్థలు 36 శాతం, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ఆపరేటర్లు 30 శాతం, బీఎఫ్ఎస్ఐ రంగాలకు 23 శాతం వాటా ఉంది. ఈ ఏడాది గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో మరో 11 మిలియన్ చదరపు అడుగుల కొత్త ఆఫీస్ స్థలాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
