
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ ఓల్డ్ సిటీ కారిడార్ నిర్మాణం కోసం రైట్ ఆఫ్ వే లభించే కీలక దశకు చేరుకున్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 7.5 కి.మీ. ఈ కారిడార్‌లో ఆస్తుల స్వాధీనం, కూల్చివేతలు, రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరాయని, సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఓల్డ్ సిటీ మెట్రో రైల్ సాకారమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభావిత ఆస్తుల సంఖ్యను వినూత్న ఇంజినీరింగ్ పద్దతులతో1,100 నుంచి 886కి తగ్గించామని, ఇప్పటివరకు 550 ఆస్తుల కూల్చివేత పూర్తి కాగా, మిగిలినవి కూడా జరుగుతున్నాయని వివరించారు. రూ.433 కోట్ల నష్టపరిహారం యజమానులకు చెల్లించామని, వర్షాలు, పండుగలు, మొహర్రం సమయంలోనూ స్థానికులకు ఇబ్బంది లేకుండా పనులు కొనసాతున్నాయని వివరించారు.
మెట్రో పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణానికి సన్నాహాలు స్పీడ్ గా జరుగుతున్నాయని, డీజీపీఎస్ సర్వే, భూగర్భ యుటిలిటీలు, భూ సామర్థ్య పరీక్షలు, సున్నితమైన కట్టడాల పరిరక్షణపై దృష్టి సారించామని ఆయన వెల్లడించారు. డీజీపీఎస్ సర్వే ద్వారా కచ్చితమైన డిజిటల్ డేటాను డ్రోన్ సర్వే డేటాతో అనుసంధానించామని, హై-ప్రెసిషన్ జీఎన్ఎస్‌ఎస్ రిసీవర్‌లతో కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో..
పురాతన రోడ్ల కింద నీటి సరఫరా, మురుగు, విద్యుత్, టెలికాం లైన్ల వంటి యుటిలిటీలను గుర్తించి, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) సర్వేతో మళ్లిస్తున్నామని, భూసామర్థ్య పరీక్షల ద్వారా మట్టి బలం, నీటి పరిస్థితులను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సున్నితమైన నిర్మాణాల రక్షణకు అలైన్‌మెంట్‌ను సర్దుబాటు చేసి, 100 మీటర్లకు ఒక మైలురాయి ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు.
హైదరాబాద్ జల మండలి, జీహెచ్ఎంసీ, టీజీఎస్పీడీసీఎల్, బీఎస్ఎన్ఎల్ సహకారంతో పనులు సజావుగా సాగుతున్నాయని, ముందస్తు సాంకేతిక చర్యలతో ఈ దశ దాటిన వెంటనే మెట్రో నిర్మాణం ప్రారంభమవుతుందని ఎండీ వెల్లడించారు. ఈమేరకు మెట్రో ఎండీ ఎవ్వీఎస్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.