టోల్ వసూళ్లకే ఓఆర్ఆర్.. సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం

 టోల్ వసూళ్లకే   ఓఆర్ఆర్..  సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం

టోల్ వసూళ్లకే   ఓఆర్ఆర్C

సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం 
ఎగ్జిట్ల వద్ద తప్పని వెయిటింగ్
పనిచేయని ఫాస్టాగ్ స్కానర్లు 
రాత్రి కొన్ని ప్రాంతాల్లో లైట్లే వెలగట్లే
డేంజరస్​గా ఓవర్‌‌లోడ్‌‌ వెహికల్స్​ 
టోల్ ఎంట్రీల వద్ద గుర్తించని సిబ్బంది 
మెయింటనెన్స్​లో ఐఆర్బీ పూర్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఔటర్‌‌ రింగ్‌‌ రోడ్డుపై ప్రయాణం సాఫీగా సాగడం లేదు. ఇక్కడ టోల్‌‌ వసూళ్లపై చూపిస్తున్న శ్రద్ధ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో చూపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎగ్జిట్​పాయింట్లు ఉన్నా వాడకపోవడం, ఫాస్టాగ్‌‌ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం వంటి కారణాలతో వేచి ఉండాల్సిన సమయం పెరిగిపోతున్నది. ఓఆర్ఆర్​పై కొన్ని కిలోమీటర్ల మేర లైట్లు వెలగడం లేదు. దీంతో ప్రమదాలు జరుగుతున్నాయి. ఇక ఓవర్​లోడ్​తో వెళ్తున్న వాహనాలను పట్టించుకోవడమే మానేశారు. కొన్ని లారీల్లో వెనక ఏ మాత్రం అడ్డు లేకుండా రాళ్లను తీసుకువెళ్తున్నారు. ఇలాంటి వాహనాలను టోల్‌‌ ఎంట్రీల వద్దే గుర్తించి నియంత్రించకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 

సహనానికి పరీక్ష..

ఓఆర్ఆర్​పై కొన్ని చోట్ల టోల్‌‌ ఎగ్జిట్​పాయింట్లు పని చేయకపోవడం, ఇతర కారణాలతో వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ఈ వెయిటింగ్​టైం10 నిమిషాలు కాగా, పండుగలు, సెలవుల టైంలో మరీ ఎక్కువగా ఉంటోంది. ట్రాఫిక్‌‌ రద్దీని తగ్గించేందుకు కొన్ని ఎగ్జిట్ల వద్ద అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేసినా..పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం లేదు. కొన్ని టోల్‌‌ ప్లాజాల వద్ద రెండు ఎగ్జిట్లు మాత్రమే పనిచేస్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఫలితంగా ఎగ్జిట్ల వద్దే కాకుండా, ఓఆర్‌‌ఆర్‌‌పైకి వచ్చే, బయటకు వెళ్లే మార్గాల్లోనూ ట్రాఫిక్‌‌ జామ్‌‌లు ఏర్పడుతున్నాయి. రద్దీని ముందుగానే అంచనా వేసి ఎగ్జిట్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన హెచ్ఎండీఏ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 

మొరాయిస్తున్న ఫాస్టాగ్‌‌ స్కానర్లు

టోల్‌‌ చెల్లింపులు వేగంగా పూర్తి చేసి వెయిటింగ్​టైం తగ్గించేందుకు తీసుకువచ్చిన ఫాస్టాగ్‌‌ వ్యవస్థ కూడా కొన్ని చోట్ల సరిగా పనిచేయడం లేదు. స్కానర్లు పని చేయకపోవడంతో సెకన్లలో వెళ్లిపోవాల్సింది నిమిషాలు పడుతోంది. పఠాన్ చెరువు లాంటి పెద్ద టోల్ గేట్​వద్ద కూడా ఫాస్టాగ్ ఉన్న లేన్లలో ఒక్కోసారి స్కానర్లు పనిచేయట్లేదు. దీంతో హ్యాండ్ మెషీన్​ద్వారా స్కాన్ చేయాల్సి వస్తోంది. ఇక కొన్ని టోల్ ఎగ్జిట్లను క్లోజ్​చేసేస్తున్నారు. రద్దీ వేళల్లో అదనపు సిబ్బందిని నియమించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.

కిలోమీటర్ల మేర అంధకారం  

ఓఆర్ఆర్ పైన ప్రధాన సమస్య తరచూ లైట్లు వెలగకపోవడం. ఈ రోడ్డు 158 కిలోమీటర్ల మేర ఉండగా పదుల కిలోమీటర్లలో లైట్లు వెలగడంలేదు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మధ్య 22 కిలోమీటర్ల మేర రూ.30 కోట్లతో 2018లో, ఆ తర్వాత 2021లో రూ.100.22 కోట్లతో 6,340 పోల్స్ కు 13వేల 392 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. గ్లోబల్‌‌ సిస్టమ్‌‌ మొబైల్‌‌ బేస్డ్‌‌ ఆటోమేషన్‌‌ రిమోట్‌‌ విధానంలో ఏర్పాటు చేసిన ఈ బల్బులతో కరెంట్​ఆదా కావడంతో పాటు ఎక్కువ కాలం వస్తాయని చెప్పారు. కానీ,  నిర్వహణ సరిగ్గా లేక అంధకారం రాజ్యమేలుతోంది. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.  
 

ఓవర్‌‌లోడ్‌‌ వెహికల్స్​తో ప్రమాదం

మరోవైపు ఓఆర్‌‌ఆర్‌‌పై ఓవర్​లోడ్​వాహనాలను అనుమతిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. టోల్‌‌ ఎంట్రీల వద్దే వీటిని గుర్తించి నియంత్రించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఓఆర్‌‌ఆర్‌‌పై ప్రయాణించే వాహనదారుల నుంచి టోల్‌‌ రూపంలో భారీగా ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాల గురించి పట్టించుకోకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓఆర్ఆర్​మెయింటెనెన్స్ చూస్తున్న ఐఆర్ బీ (ఐడియల్​రోడ్​బిల్డర్స్) నిర్లక్ష్యం వల్లే సమస్యలు వస్తున్నాయని, సదరు సంస్థకు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి నిర్వహణ సరిగ్గా చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.