మల్కాజ్‌గిరి, వెలుగు: నాగోల్‌లో ఎండీఎంఏ డ్రగ్ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఓటీ ఎల్‌బీ నగర్ జోన్, నాగోల్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుల వద్ద 25.65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌తో పాటు రూ.3.62 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బుధవారం సాయంత్రం నాగోల్ ఎక్స్ రోడ్ వద్ద రెండు హోండా యాక్టివా వాహనాలపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని ఆపి తనిఖీ చేశారు.
వాహనాల డిక్కీల్లో పాలిథిన్ కవర్లలో దాచిన ఎండీఎంఏ డ్రగ్ బయటపడింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అరెస్టయిన వారిని జునైద్ రాజా సిద్ధిఖీ(36), సునీల్ సుబ్బా అలియాస్ జానీ(29)గా గుర్తించారు. వీరిద్దరూ నగరంలోని పలువురికి డ్రగ్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. డ్రగ్‌ను హిమాచల్ ప్రదేశ్ నుంచి మహ్మద్ అన్సార్, రాజు పంపినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
కాంకోల్ లో కొకైన్ స్వాధీనం..
హైదరాబాద్ సిటీ: సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కాంకోల్ టోల్‌గేట్ వద్ద గురువారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.2.01 లక్షల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. సీఐ చంద్రశేఖర్, ఎస్సై అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి 8.6 గ్రాముల కొకైన్, 8.5 గ్రాముల చరస్, 0.4 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బిహార్‌కు చెందిన ఎండీ అబ్దుల్‌ను అరెస్టు చేశారు.
ఇక పహాడ్ షరీఫ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 61 బాటిళ్ల ఎన్‌డీపీఎల్ మద్యం పట్టుకున్నట్లు ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు. వీటి విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని చెప్పారు. ధూళిపేట్‌లో పీలా చోటా శివ మందిర్, జియాగూడ కబేలా ప్రాంతాల్లో ఇద్దరు నిందితుల వద్ద నుంచి 1.321 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖిలావాల విజయ్ సింగ్, ఎండీ సాబీర్ అలీని పోలీసులు అరెస్టు చేశారు.
