హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణపై పోలీసుల ఫోకస్..

హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణపై పోలీసుల ఫోకస్..
  • సైబరాబాద్​ మున్సిపల్​, పోలీస్​ కమిషనర్లు 

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్‌‌లో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం, రహదారి భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన తెలిపారు. బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌‌లో ‘ట్రాఫిక్ కన్వర్జెన్స్’ సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్​  ఎం.రమేష్‌‌తో పాటు జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ ఇంజినీర్, ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగర నిర్వహణపై ప్రభావం చూపుతున్న పలు కీలక అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా కమిషనర్లు మాట్లాడుతూ, రాబోయే వర్షాకాలంలో ట్రాఫిక్‌‌కు ఆటంకం కలిగించే నీటి నిల్వ ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 20, కూకట్‌‌పల్లిలో 9, కుత్బుల్లాపూర్‌‌లో 9 ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై ఎక్కువగా నిలుస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

పోలీస్ నియంత్రణలో ఉన్న సుమారు 21 వేల సీసీ కెమెరాలను మున్సిపల్ పర్యవేక్షణకు కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. వీటి ద్వారా పారిశుధ్యం, నిర్మాణ వ్యర్థాల అక్రమ డంపింగ్‌‌ను పర్యవేక్షించడం, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్‌‌ను గుర్తించడం, మున్సిపల్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు.