బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోంది

బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోంది
  • చేసి తీరుతామన్న పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ 
  • కేసీఆర్ చేసినపుడు లేని ఆంక్షలు ఇప్పుడే ఎందుకని ప్రశ్న
  • అనుమతిపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేతలు

హైదరాబాద్, వెలుగు: ఇందిరా పార్క్ వద్ద గురువారం బీజేపీ చేపట్టనున్న ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’కు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష కొనసాగించి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు, ఆందోళనలు చేసే వేదికైన ధర్నాచౌక్ వద్ద బీజేపీ దీక్షకు అనుమతి నిరాకరించడం షాక్​కు గురిచేసిందని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారని, అప్పుడు లేని ఇబ్బంది ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని, ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతున్న బీజేపీని అణచివేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ తప్పూ చేయకపోయినా బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అందులో భాగమేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడతామన్నారు. టీఆర్ఎస్ సర్కారు చెంప చెళ్లుమనిపించేలా బీజేపీ దీక్షకు సంఘీభావం తెలపాలని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులను సంజయ్ కోరారు. కాగా, దీక్షకు అనుమతి నిరాకరణపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

స్పీకర్​.. టీఆర్​ఎస్​కు తొత్తు

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని టీఆర్​ఎస్​ ప్రభుత్వం మంటగలుపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేసి పార్లమెంటరీ సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్​ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలంటూ స్పీకర్​కు హైకోర్టు చెప్పినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా నడుచుకోవాల్సిన స్పీకర్​.. టీఆర్​ఎస్​కు తొత్తులా మారారని, అది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని మండిపడ్డారు.  బీజేపీ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించాలన్న హైకోర్టు సూచనలనూ స్పీకర్​ తిరస్కరించడాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాద్​ ఇందిరాపార్క్​ వద్ద ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ చేపడుతున్న నేపథ్యంలో సంజయ్​ ప్రెస్​నోట్​ విడుదల చేశారు. ఉదయం పదింటి నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే దీక్షలో ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రఘునందన్​రావు, రాజాసింగ్​తో పాటు ఎంపీలు సోయం బాబపూరావు, ధర్మపురి అర్వింద్​, పార్టీ ప్రధాన నేతలు పాల్గొంటారని చెప్పారు.