
హైదరాబాద్, వెలుగు: సామాన్యులపై ట్రాఫిక్ రూల్స్ కొరఢా ఝులిపించే పోలీసులు అడ్డగోలుగా రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పే పోలీసులే రూల్స్ తమకు వర్తించవు అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఒంటిపై యూనిఫాంతో కొందరు రూల్స్ బ్రేక్ చేస్తుంటే.. మరికొందరు పోలీస్ వెహికల్స్‌పై అడ్డదిడ్డంగా చక్కర్లు కొడుతున్నారు.
డీజీపీ పేరిట ఉన్న పోలీస్ వాహనాలపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 17,391 పెండింగ్ చలానా కేసులు నమోదు కాగా..ఇందుకు సంబంధించి మొత్తం రూ.68 లక్షల 67 వేల 885 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ఈ వివరాలను హైదరాబాద్ ట్రాఫిక్‌మెన్‌గా పేరొందిన లోకేంద్రసింగ్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా సేకరించాడు. పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదంటూ తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
నేను ట్రాఫిక్ పోలీసులను చాలా గౌరవిస్తాను. చట్టాన్ని అమలు చేసే అధికారుల జవాబుదారీతనం పట్ల నమ్మకం ఉంది. అధికారులు చెప్పిన వాటిని పాటించకపోతే, సేవ ఉద్దేశం దెబ్బతింటుంది. సంబంధిత కమిషనర్లు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించని డ్రైవర్లు జరిమానాలు చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేస్తారని, భవిష్యత్తులో పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలను నిరోధించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిస్తున్నాను’’అని లోకేంద్రసింగ్ ట్వీట్ చేశారు.
కామెంట్లతో నెటిజన్ల హల్చల్
లోకేంద్రసింగ్ పోస్ట్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్లతో హల్చల్ చేస్తున్నారు . ‘పెండింగ్ చలాన్ల చెల్లింపుపై సొంత డిపార్ట్మెంట్ వాళ్లు పెట్టిన డిస్కౌంట్ ఆఫర్లు వీళ్లు మర్చిపోయినట్టు కనిపిస్తున్నది. ఇలాంటి పెండింగ్ చలాన్ల వాహనాలను కూడా ప్రయాణం మధ్యలో ఆపి, మిగతా వారందరికీ చేస్తున్నట్లుగా, డబ్బు చెల్లించిన తర్వాతే ముందుకు అనుమతించాలి’’ అని ఒకరు కామెంట్ చేశారు. “అధికారులు చేసే ఉల్లంఘనలకు ఎంవీ చట్టం 2019లోని 210(బీ) ప్రకారం ఫైన్ విధించాలి. దీని ప్రకారం జరిమానాకు రెట్టింపు అంటే మొత్తం రూ 1.37 కోట్లు అవుతుంది’’ అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు. కాగా, సోషల్ మీడియాలో లోకేంద్రసింగ్ పోస్ట్ వైరల్ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సంబంధిత చలాన్లవారీగా సిబ్బందిని గుర్తించి, తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.