- ఈవెంట్లలో అసభ్యత కన్పించకూడదు
- ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఉండాలి
బషీర్‌బాగ్, వెలుగు: న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నిర్వహించే వేడుకల నేపథ్యంలో 3 స్టార్, 5 స్టార్ హోటళ్లు, క్లబ్‌లు, పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల యాజమాన్యాలకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పలు మార్గదర్శకాలు విడుదల చేశారు.
అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్లతో కార్యక్రమాలు నిర్వహించాలంటే కనీసం 15 రోజుల ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తగిన భద్రతా సిబ్బంది నియమించుకోవాలని పేర్కొన్నారు. ఈవెంట్లలో అసభ్యత, నగ్నత్వం ఉండకూడదని, బహిరంగ ప్రదేశాల్లో రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ సిస్టమ్ నిషేధమని స్పష్టం చేశారు.
ఇండోర్ ప్రాంగణాల్లో మాత్రమే రాత్రి 1 వరకు, 45 డెసిబుల్స్ లోపే శబ్దానికి అనుమతి ఉంటుందని తెలిపారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగం పూర్తిగా నిషేధమని, మైనర్లకు ప్రవేశం ఇవ్వరాదని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయానికి మించి మద్యం సరఫరా చేయరాదని, మద్యం సేవించిన వినియోగదారుల కోసం డ్రైవర్లు లేదా క్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని పేర్కొన్నారు.
బాణసంచా ప్రదర్శనలకు కూడా అనుమతి లేదన్నారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, పట్టుబడితే రూ.10 వేల జరిమానా, 6 నెలల జైలుశిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ వంటి శిక్షలు ఉంటాయని వివరించారు. ఈ మేరకు హెచ్చరికలను ఈవెంట్ ప్రాంగణాల్లో ప్రదర్శించాలని ఆయన ఆదేశించారు.
