భాష ఏదైనా క్షణాల్లో ఫిర్యాదు.. ‘ఏఐ కాప్‌‌‌‌‌‌‌‌రైట‌‌‌‌‌‌‌‌ర్’ యాప్ను ఆవిష్కరణ

భాష ఏదైనా క్షణాల్లో ఫిర్యాదు.. ‘ఏఐ కాప్‌‌‌‌‌‌‌‌రైట‌‌‌‌‌‌‌‌ర్’ యాప్ను ఆవిష్కరణ

బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్ నగర పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని మరింత విస్తరింపజేస్తూ మరో వినూత్న సేవను అందుబాటులోకి తీసుకువచ్చామని హైదరాబాద్​ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. 

దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల నమోదు యాప్ ‘ఏఐ కాప్‌‌‌‌‌‌‌‌రైట‌‌‌‌‌‌‌‌ర్’ను హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రారంభించిందన్నారు. శనివారం బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని టీజీఐసీసీసీలో జరిగిన కార్యక్రమంలో ఈ యాప్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించి దాని పనితీరును పరిశీలించినట్టు ల్లడించారు. హైదరాబాద్ వంటి మహానగరంలో తెలుగు, ఇంగ్లిష్ తెలియని ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పర్యాటకులు, విదేశీయులు ఫిర్యాదులు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీ పేర్కొన్నారు.

భాషా సమస్యల కారణంగా ఎఫ్‌‌ఐఆర్ నమోదులో జాప్యం జరగడం, వివరాలు తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలకు ఈ యాప్ పరిష్కారంగా నిలుస్తుందని సీపీ సజ్జనార్​ చెప్పారు. బాధితుడు తన మాతృభాషలో మాట్లాడితే, యాప్ వెంటనే ఆ సమాచారాన్ని గుర్తించి పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదించి అధికారిక రికార్డుగా మార్చుతుందని వివరించారు. ఈ యాప్ ద్వారా హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ సహా పది కంటే ఎక్కువ భారతీయ భాషలను గుర్తించి ఫిర్యాదులను రాతపూర్వకంగా నమోదు చేయవచ్చని తెలిపారు. 

మాట్లాడిన ప్రతి ఐదు సెకన్లకోసారి సమాచారం అప్‌‌డేట్ అవుతుండటంతో ఫిర్యాదు నమోదు ప్రక్రియ వేగవంతమవుతుందని చెప్పారు. అలాగే బాధితుడు, నిందితుడు, సాక్షులు మాట్లాడిన వివరాలను వేర్వేరుగా గుర్తించి రికార్డు చేసే సౌకర్యం కూడా ఈ యాప్‌‌లో ఉందన్నారు. న్యాయం పొందడంలో భాష ఎప్పటికీ అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ఈ యాప్‌‌ను రూపొందించినట్లు తెలిపారు. 

ఈ యాప్‌‌ను హైదరాబాద్ సిటీ పోలీస్,  బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థ సహకారంతో, ఇంటర్న్ పాగ్రో చందు సాంకేతిక భాగస్వామ్యంతో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ (క్రైమ్స్ అండ్ సిట్) ఎం. శ్రీనివాసులు, అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ సీహెచ్ రూపేశ్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రమేశ్,బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్  ప్రతినిధులు పాల్గొన్నారు.