Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోల మార్ఫింగ్.. సీపీ సజ్జనార్‌కు ఫ్యాన్స్ ఫిర్యాదు!

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోల మార్ఫింగ్..  సీపీ సజ్జనార్‌కు ఫ్యాన్స్ ఫిర్యాదు!

పాన్-ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు దేశవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలైనా, వ్యక్తిగత విషయాలైనా సోషల్ మీడియాలో భారీ ట్రెండింగ్ కనిపిస్తుంది. అయితే, ఇటీవల కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ దుశ్చర్యపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీపీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిర్యాదు..

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ సైబర్ నేరాన్ని అరికట్టేందుకు ఎన్టీఆర్ అభిమానులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. లేటెస్ట్ గాహైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సజ్జనార్ కు ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి ఆధ్వర్యంలో అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు. తమ అభిమాన హీరో ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర రీతిలో ట్రోల్స్, మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వ్యక్తులపై, ఆ హ్యాండిల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు..

 ఎన్టీఆర్ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉన్న కంటెంట్‌ను తక్షణమే ఆయా ప్లాట్‌ఫామ్స్ నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదొక దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించిన అభిమానులు, ఈ అభ్యంతరకరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న వారిపై ప్రభుత్వం తక్షణమే, బలవంతంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సీపీ సజ్జనార్ సైతం... సెలబ్రిటీలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్న వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉంది.

 

'పర్సనాలిటీ రైట్స్' చర్చకు తెర..

ఈ సంఘటన కేవలం ట్రోలింగ్ మాత్రమే కాకుండా, సెలబ్రిటీల నకిలీ చిత్రాల వ్యాప్తి, సైబర్‌బుల్లీయింగ్ వంటి విస్తృత అంశాలపై చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో నియంత్రణ లేకుండా జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిమానులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు తమ 'పర్సనాలిటీ రైట్స్' (వ్యక్తిత్వ హక్కుల) రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

భారతదేశంలోనే కాక, విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ బేస్‌ కలిగిన ఎన్టీఆర్ వంటి అగ్ర నటుడికి ఇలాంటి అనుభవం ఎదురుకావడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి మార్ఫింగ్ లేదా తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను షేర్ చేయకుండా, కనిపిస్తే రిపోర్ట్ చేయాలని వారు అందరినీ కోరుతున్నారు.