చందానగర్​లో రూ. 99 లక్షలు సీజ్

చందానగర్​లో రూ. 99 లక్షలు సీజ్

చందానగర్, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిటీలో వెహికల్ చెకింగ్ చేస్తున్న పోలీసులు భారీగా డబ్బును పట్టుకుంటున్నారు. సోమవారం హఫీజ్ పేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి పెద్ద ఎత్తున డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న చందానగర్, మాదాపూర్ ఎస్​వోటీ పోలీసులు చందానగర్ మెయిన్​రోడ్ లో తనిఖీలు చేపట్టారు. కారులో వెళ్తున్న నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని  రూ.99 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి అతడు ఎలాంటి పేపర్లను చూపించకపోవడంతో సీజ్ చేసి పీఎస్​కు తరలించారు.

రాంగోపాల్ పేటలో హవాలా క్యాష్​ స్వాధీనం 

ఆదివారం రాత్రి రాంగోపాల్ పేట పీఎస్ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా హవాలా క్యాష్​ పట్టుబడింది. శివరాంపల్లిలో ఉండే శివాన్షు రాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నల్లగుట్టకు చెందిన అతడి ఫ్రెండ్ భవేశ్​కుమార్ జైన్​తో కలిసి శివాన్షు హవాలా ఏజెంట్లతో పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరు కలిసి హవాలా క్యాష్​ను వ్యాపారులకు చేరవేస్తున్నారు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ వెనకవైపు నుంచి నల్లగుట్ట వైపునకు శివాన్ష్, భవేశ్​ రూ.34 లక్షల 50 వేలను జీపులో తరలిస్తుండగా సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు  పట్టుకున్నారు. వారిద్దరితో పాటు జీపు డ్రైవర్ మన్సూర్​ను సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటు పట్టుబడ్డ క్యాష్​​ను,  జీపును, 3 సెల్ ఫోన్లను రాంగోపాల్ పేట పోలీసులకు అప్పగించారు.