రూల్స్ ​పాటించని పబ్బులకు నోటీసులు 

రూల్స్ ​పాటించని పబ్బులకు నోటీసులు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌ మైనర్ గ్యాంగ్‌‌‌‌ రేప్‌‌‌‌ ఘటనతో పోలీసులు అలర్ట్‌‌‌‌ అయ్యారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని పబ్​లు, బార్‌‌‌‌ ‌‌‌‌అండ్ రెస్టారెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రూల్స్ పాటించని పబ్సులపై పోలీస్ యాక్ట్‌‌‌‌ కింద కేసులు నమోదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా పబ్​ఓనర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. విమెన్‌‌‌‌ సేఫ్టీతోపాటు రూల్స్ ప్రకారమే పబ్​లు నిర్వహించాలని చెబుతున్నారు. సెక్టార్​ఎస్సైలతో పబ్​ల వివరాలు సేకరించి ఎక్సైజ్‌‌‌‌ అధికారులతో కలిసి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. లైసెన్స్‌‌‌‌, ఈవెంట్ల పర్మిషన్లకు సంబంధించిన వివరాలు రికార్డ్‌‌‌‌ చేస్తున్నారు.

గ్రేటర్లో 100
ఎక్సైజ్‌‌‌‌శాఖ అనుమతులతో హైదరాబాద్‌‌‌‌, రాచకొండ, సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్ల పరిధిలో 61 పబ్‌‌‌‌లు నడుస్తున్నాయి. స్టార్‌‌‌‌ ‌‌‌‌హోటల్స్​లోని బార్‌‌‌‌ అండ్‌‌‌‌ రెస్టారెంట్లతో కలిపి మొత్తం100కు పైగా కొనసాగుతున్నాయి. వీటన్నింటికి నిబంధనలతో కూడిన లైసెన్సులు ఉన్నాయి. వీటిని ప్రతిరోజు అర్ధరాత్రి12 గంటల వరకు, వీకెండ్స్​లో ఒంటి గంట వరకు నడిపేందుకు పర్మిషన్​ఉంది. కానీ చాలాచోట్ల నిర్వాహకులు రూల్స్‌‌‌‌ పాటించడం లేదని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల తెల్లవారుజాము వరకు కొనసాగుతున్నాయని, సౌండ్ పొల్యూషన్ తో పాటు, పార్కింగ్ సమస్య, రోడ్లపై న్యూసెన్స్‌‌‌‌ చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. 

మఫ్టీలో వెళ్లి..
ఈవెంట్లు, ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌‌‌‌ పేరుతో మైనర్లను పబ్బుల్లోకి అనుమతిస్తున్నట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి పబ్​ల వివరాలను సేకరిస్తున్నారు. జీయో ట్యాంగింగ్​తో పబ్​ల డేటా రికార్డ్‌‌‌‌ చేస్తున్నారు. నాన్‌‌‌‌ ఆల్కహాలిక్‌‌‌‌ పార్టీలపై నిఘా పెట్టారు. మైనర్ల పబ్‌‌‌‌లోకి రానివ్వడంతోపాటు లిక్కర్ సర్వ్‌‌‌‌ చేయడంపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఆపరేషన్స్​ను మఫ్టీలో నిర్వహిస్తున్నారు. పబ్​ఎంట్రీ, ఎగ్జిట్లతోపాటు పబ్​పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఐడీ కార్డ్‌‌‌‌ ప్రూఫ్​తప్పనిసరి చేస్తున్నారు. రూల్స్ పాటించని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి కేసులు బుక్ చేస్తున్నారు. 

రూల్స్​ పాటించకపోతే చర్యలుంటయ్

పబ్ నిర్వాహకులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించాం. ఎక్సైజ్ గైడ్‌‌‌‌లైన్స్ పాటించాలని సూచించాం. మైనర్లను ఎట్టి పరిస్థితిల్లో అనుమతించ వద్దని ఆదేశించాం. డ్రగ్స్‌‌‌‌ సప్లై, రేవ్​పార్టీలపై నిఘా పెట్టాం. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే సమాచారం వచ్చేలా నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఏర్పాటు చేసుకున్నాం. రూల్స్​పాటించని పబ్​లపై చర్యలు తీసుకుంటాం.- సీవీ ఆనంద్, హైదరాబాద్‌‌‌‌ సీపీ