- త్వరలో మల్టీ లెవల్ పార్కింగ్ యాప్
- ఆటోల విచ్చలవిడి పార్కింగ్ నియంత్రణకు ప్రత్యేక స్థలాలు
- ట్రాఫిక్ సమస్యలపై సమవేశంలో అధికారుల నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న బస్టాప్‌లను రోడ్డు వెడల్పు ఎక్కువ ఉన్న ప్రాంతాలకు మార్చాలని నిర్ణయించారు. సిటీలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వానాకాలంలో సమస్యలు, ప్రజా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ అధ్యక్షతన గురువారం టీజీ-ఐసీసీసీ ఆడిటోరియంలో వివిధ శాఖల ఉన్నతాధికారుల ‘కన్వర్జెన్స్ సమావేశం’ జరిగింది. ఇందులో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్లు, హైడ్రా, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇందులో ప్రధాన జంక్షన్లలో రద్దీ తగ్గించేందుకు పెండింగ్ జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ పనులను వేగవంతం చేయాలని, వర్షాకాలంలో వాటర్ లాగింగ్ నివారణకు మలక్‌పేటలో సక్సెస్అయిన ‘రోబోటిక్ క్లీనింగ్’ విధానాన్ని అన్ని చోట్లకు విస్తరించాలని, రోడ్డు మధ్యలోని సులభ్కాంప్లెక్సులను తొలగించడం, అవసరమైన చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జుల నిర్మాణం చేపట్టాలని, పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని మల్టీలెవల్ పార్కింగ్ సౌకర్యాలను విస్తరించడం, త్వరలో ‘మల్టీలెవల్ పార్కింగ్ యాప్’ను ప్రారంభించాలని, పురాణాపుల్, బహదూర్‌పురా, ఎంజే మార్కెట్, మాసాబ్ ట్యాంక్, బేగంపేట్ వంటి ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో రెయిలింగ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ఆటోల విచ్చలవిడి పార్కింగ్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
డివైడ్ చేసుకుని పరిష్కరిస్తాం
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ సమస్యలను స్వల్పకాలిక (15 రోజులు) మధ్యకాలిక ( -3 నెలలు), దీర్ఘకాలికంగా (3 నెలలు పైబడిన) వర్గీకరించి పరిష్కరిస్తామని, అధికారులకు -బడ్జెట్, అధికారాలు, బదిలీ చేస్తామన్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ వర్షాకాల నీటి నిల్వ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు.
ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయల్ డేవిస్బస్టాపుల పునర్వ్యవస్థీకరణ, సులభ్కాంప్లెక్సుల తరలింపు, రోబోటిక్ క్లీనింగ్ విస్తరణ, రెయిలింగ్‌ల ఏర్పాటు, ఆటో పార్కింగ్ నియంత్రణపై పలు సూచనలు చేశారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ట్రాఫిక్ డీసీపీలు, హెచ్‌ఎండీఏ, జీసీఐ, కంటోన్‌మెంట్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
