పండక్కి ఊళ్లకు పోతున్నరు!

పండక్కి ఊళ్లకు పోతున్నరు!

హైదరాబాద్, వెలుగు : బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకునేందుకు సిటీలో ఉంటున్న వారు సొంతూళ్లకు వెళ్తున్నారు. పిల్లలకు దసరా సెలవులు ఇవ్వడంతో సిటీలోని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో రద్దీ పెరిగింది. డైలీ  ఆర్టీసీ బస్సుల్లో లక్షన్నర మంది, రైళ్లలో 3 లక్షల మంది వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పండుగల నేపథ్యంలో రైల్వేశాఖ మూడు, నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఆర్టీసీ 4,198 బస్సులు, ఆన్​లైన్​రిజర్వేషన్​కల్పిస్తూ 517 అదనపు సర్వీసులు ఏర్పాటు చేసింది. రేపటి నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అలాగే దసరా, దీపావళి నేపథ్యంలో రెగ్యులర్​ట్రైన్లతోపాటు సికింద్రాబాద్ నుంచి వైజాగ్, భువనేశ్వర్​కి 52 రైళ్లు, భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ కు 53, భువనేశ్వర్ నుంచి ముంబై వయా సికింద్రాబాద్16 ట్రైన్లు నడుపుతున్నారు. ఎంజీబీఎస్​దాకా రాకుండా కూకట్​పల్లి, బీహెచ్ఈఎల్, మియాపూర్, ఎల్‌‌బీనగర్, దిల్ సుఖ్​నగర్, ఆరాంఘర్, ఉప్పల్ పాయింట్ల నుంచి బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 30వ తేదీన బెంగళూరుకి ఎక్కువగా ఆన్లైన్ రిజర్వేషన్లు అవుతున్నట్లు డిప్యూటీ రీజనల్ మేనేజర్ జ్యోతి తెలిపారు. ఆరోజున అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మనవరాళ్లను ఊరికి తీస్కపోతున్న

నా కూతురు చేవెళ్లలో ఉంటది. ఇద్దరు మనవరాళ్లకు రెండు వారాలు సెలవులు ఇచ్చారని తెలిసి తీస్కపోదామని వచ్చినా. పిల్లలు రెండు వారాలు మా ఊర్లనే ఉంటరు. పండక్కి ఊరికి వెళ్తున్నామని పిల్లలు మస్త్ సంతోషపడుతున్నరు. 

- ధనలక్ష్మి, చేవెళ్ల

రద్దీ మొదలైంది

ఈ నెల 24 నుంచి రద్దీ పెరిగింది. 30 తేదీ దాకా ఇలాగే ఉండొచ్చు. టికెట్ రేట్లు పెంచలేదు. ప్యాసింజర్ల రద్దీని బట్టి బస్‌‌ సర్వీసులు పెంచుతున్నాం. మాములు రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఈసారి సిటీ నుంచి ఆరు లక్షల మంది ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేస్తారని అంచనా వేస్తున్నాం. 

- ఎ.శ్రీధర్, రీజనల్ ​మేనేజర్, రంగారెడ్డి రీజియన్, టీఎస్‌‌ఆర్‌‌‌‌టీసీ