ఇండ్లలో మోకాలి లోతు నీళ్లు.. రాత్రంతా జాగారం!

ఇండ్లలో మోకాలి లోతు నీళ్లు.. రాత్రంతా జాగారం!
  • వానలతో సిటీలో ముంపు ప్రాంతాలు ఆగమాగం
  • వరదనీటిలో పలు కాలనీలు, బస్తీలు
  • ఇండ్లలోకి చేరిన వరద 
  • భయంతో బాధితుల పరుగులు
  • తడిసిన నిత్యావసరాలు 
  • వండుకునే పరిస్థితి లేక పస్తులు  
  • జీహెచ్‌‌‌‌ఎంసీ హెల్ప్‌‌‌‌ లైన్‌‌‌‌కి కాల్‌‌‌‌ చేస్తే నో రెస్పాన్స్

హైదరాబాద్, వెలుగు: ఎడతెరిపి లేని వానలతో సిటీలో  కాలనీలు, బస్తీల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక, కంటి మీద కునుకు కూడా పోవడంలేదు. ఇండ్లను ఖాళీ చేసి బంధువులు, తెలిసిన వారి వద్దకు  వెళ్లి ఉంటున్నారు.  బియ్యం, వంట సామగ్రి తడిసిపోగా తిండికోసం ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇండ్లలోనే పస్తులు ఉండి జాగారం చేస్తున్నారు. 

ఎల్బీనగర్​,గాజులరామారం, సరూర్ నగర్, ఖైరతాబాద్, టోలీచౌకి,  మన్సూరాబాద్‌‌‌‌,  బేగంపేట్, బోరబండ, మూసాపేట,  చాంద్రాయణగుట్ట, కుషాయిగూడ,  బేగంపేట్, హైటెక్‌‌‌‌ సిటీ  తదితర ప్రాంతాల్లోని సరూర్ నగర్, ఖైరతాబాద్ లోని సీఐబీ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ లాంటి ప్రాంతాల్లో బయటకు వెళ్లలేక ఉదయం పిల్లలకు పాలు కూడా లేవు. కొన్నిచోట్ల చంటిపిల్లలను ఎత్తుకొని మంచాలపై కూర్చుని రాత్రంతా నిద్రపోవడంలేదు. ఇలా అనేక ప్రాంతాల్లో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యల ఎదురు చూస్తున్న అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఫిర్యాదులు చేసినా..  

సిటీలో 4,500 కాలనీలు ఉన్నాయి. ఇందులో వంద లాది కాలనీలు ముంపు బారిన పడ్డాయి. ఇండ్లలోకి వరదనీరు చేరిందని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగోల్‌‌‌‌లోని అయ్యప్పకాలనీలో దాదాపు 800 వరకు ఇండ్లు ఉన్నాయి.  

గత రాత్రి కురిసిన వానకి వరదనీరు ఇండ్లలోకి చేరడంతో  రాత్రంతా జాగారం చేశామని, వండుకునే పరిస్థితి లేక పస్తులు ఉన్నామని, జీహెచ్‌‌‌‌ఎంసీ,హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌కి ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేదని, ప్రతి ఏడాది ఇదే రిపీట్‌‌‌‌ అవుతుందని కాలనీవాసులు మండిపడుతున్నారు. సంతోశ్​నగర్‌‌‌‌‌‌‌‌  ప్రాంతంలోని సింగరేణి బస్తీలో  దాదాపుగా 8 వేల జనాభా ఉంటుంది. డ్రైనేజీ, క్లీన్‌‌‌‌ చేయకపోవడంతో వరదనీరు లోతట్టు ప్రాంతాల్లోని చేరింది.  

మోకాళ్లలోతు నీళ్ల కారణంగా..

బేగంపేట్‌‌‌‌లోని ప్రకాశ్​నగర్‌‌‌‌, ‌‌‌‌ ఖైరతాబాద్‌‌‌‌ లోని సీఐబీ క్వార్టర్స్‌‌‌‌ వద్ద పలు ఇండ్లు, అంజినగర్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని సిద్దిఖ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌.. ఇలా సిటీలోని ఆయా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.  డ్రైనేజీలు పొంగి లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వచ్చి చేరుతుండగా మోకాళ్ల లోతు నీళ్లు ఉంటున్నాయని బాధితులు పేర్కొంటున్నారు. మోటార్లను కిరాయికి తెచ్చి నీటిని బయటకి పంపిస్తున్నామన్నారు. ఇళ్లలోని బురద, నీటిని బయటకు ఎత్తిపోసుకోవడమే  సరిపోతుందంటున్నారు. 

పనులకు కూడా పోవడంలేదంటున్నారు.  వానలతో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండగా ఇండ్లలోకి మురుగునీరు చేరుతుంది. దీంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంది. ఇది సీజనల్‌‌‌‌ వ్యాధులు సోకే కాలం కావడంతో జనం భయాందోళన చెందుతున్నారు. 

ALSO READ:కేటీఆర్.. హెలికాప్టర్ పంపి కాపాడండి..: సీతక్క

నీట మునిగిన సిక్కు బస్తీ

మూసాపేట:ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సిక్కు బస్తీ నీట మునిగింది. బుధవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి బస్తీలోని 30 ఇండ్లల్లోకి నీరు చేరింది.   

నేడు ఎల్లో అలర్ట్ 

సిటీలో శుక్రవారం(నేడు) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(6.4 నుంచి 11.5 సెంటిమీటర్ల వర్షం కురిసే అవకాశం) జారీ చేసింది. గురువారం అత్యధికంగా గచ్చిబౌలిలో 4.3, షేక్ పేట్ లో 3.1, అత్తాపూర్ లో 3.0, గోల్కొండలో 2.4 సెంటిమీటర్ల చొప్పున నమోదైంది. 

రాత్రంతా కుర్చీలోనే.. 

ఇంట్లోకి వాన నీళ్లు రావడంతో  రాత్రంతా కుర్చీలోనే  కూర్చున్నం. రెండు రోజులుగా సరైన తిండిలేక ఇబ్బందులు పడుతున్నాం.   వానాకాలం వస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. శాశ్వత పరిష్కారం చూపడంలేదు.  

‌‌‌‌‌‌‌‌ - ఉషాదేవి,అయ్యప్ప కాలనీ, నాగోల్‌‌‌‌

బంధువుల ఇంట్లో ఉంటున్నం 

ఫిర్యాదు చేసి మూడు రోజులైంది.  ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంట్లోని వస్తువులు 3 రోజుల నుంచి వాటర్‌‌‌‌‌‌‌‌లో తడుస్తూ కరాబ్‌‌‌‌ అయితున్నాయి. పక్కవీధిలోని బంధువుల ఇంట్లో తిని అక్కడే ఉంటున్నం. 

- భవాని, ప్రకాశ్​నగర్‌‌‌‌‌‌‌‌, బేగంపేట

ఎవరూ వస్తలేదు 

మా సమస్యపై ఎన్నిసార్లు చెప్పినా అధికారు లు, ప్రజాప్రతినిధులు ఎవరూ వస్తలేదు. ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. చిన్నవాన పడినా ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయి. రెండు మూడు రోజులు తిండితిప్పలు లేక వరదనీటి ని బయటకు పంపడమే సరిపోతుంది. 
- గోవింద్, సింగరేణికాలనీ