హైదరాబాద్ వర్షం అప్డేట్.. మణికొండ పబ్లిక్కు ఈ సంగతి తెలుసా..?

హైదరాబాద్ వర్షం అప్డేట్.. మణికొండ పబ్లిక్కు ఈ సంగతి తెలుసా..?

రంగారెడ్డి జిల్లా: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌ జామ్‌లతో వాహనదారులు పరేషన్‌ అవుతున్నారు. మణికొండలో స్థానికులు వాడుతున్న వాహనాల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరిగిపోతుంది. దీంతో రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా ప్రాంతాలు, చౌరస్తాలు, కూడళ్లలో ట్రాఫిక్‌ సమస్య వర్ణనాతీతంగా మారింది. చిన్న పాటి వర్షం కురిసిందంటే చాలు ఈ ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారుతుంది. ఈ ట్రాఫిక్‌ సమస్యను పూర్తిగా నివారించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాహనాదారులు కోరుతున్నారు.

హైదరాబాద్లో వాన శుక్రవారం దంచికొట్టిన సంగతి తెలిసిందే. శనివారం కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం మాత్రం 4 గంటల పాటు గ్యాప్ ఇవ్వకుండా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, షాపులు, కాలనీల్లోకి నీరు చేరి జనాలు ఇబ్బందిపడ్డారు. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

బాలానగర్లో అత్యధికంగా 11.53 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆరాంఘర్ వద్ద వరదలో బస్సు చిక్కుకున్నది. ప్యాట్నీ నాలా పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అదే విధంగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది.

రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జోరు వాన కురిసింది. కుండపోత వర్షం కారణంగా ఐటీ కారిడార్ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. బయో డైవర్సిటీ జంక్షన్ ప్రిస్టన్​మాల్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు చేరి కార్లు నీట మునిగాయి.