
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలో మేఘావృతమైన వాతావరణం కొనసాగనుందని తెలిపింది. ఈరోజు నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో హైదరాబాద్ నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, హైడ్రా, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఐఎండీ సూచనలు చేసింది. ప్రస్తుతం నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. నగరంలో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. బల్కంపేట, బేగంపేట్, ఎస్సార్ నగర్,అమీర్ పేట్, సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారా హిల్స్లో చిరుజల్లులు పడుతున్నాయి.
హైదరాబాద్ సిటీలో సోమవారం సాయంత్రం నుంచి కొన్ని గంటల పాటు వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అత్యధికంగా బీహెచ్ఈఎల్లో 2.08 సెంటీమీటర్లు, లింగంపల్లి ఎంఎంటీఎస్ పరిధిలో 2.05, షేక్ పేట 1.95, గచ్చిబౌలిలో 1.93 సెంటిమీటర్ల వర్షం పడింది. నగరంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో సుమారు 6.45 సెంటిమీటర్ల నుంచి 11.55 సెంటిమీటర్ల వరకు వాన కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.