
- హైదరాబాద్‌లో 3 గంటలపాటు కుండపోత
- కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 15.15 సెంటీ మీటర్లు
- ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం.. చెరువులను తలపించిన రహదారులు
- నడుంలోతు నీళ్లల్లో ముందుకు కదలని వాహనాలు
- కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు
- పలుచోట్ల పిడుగులు, విరిగిపడిన చెట్లు.. నగరంలో జనజీవనం అతలాకుతలం
హైదరాబాద్ సిటీ నెట్వర్క్, వెలుగు: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి దాదాపు 3 గంటలపాటు ఎడతెరిపిలేకుండా వాన దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. మొదటి అరగంటలోనే జూబ్లీహిల్స్‌లో 7.4 సెంటీ మీటర్లు, మెహిదీపట్నం లో 5.3, శ్రీనగర్ కాలనీలో 5, బంజారాహిల్స్ లో 4.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో 15.15 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డు కాగా.. బంజారాహిల్స్‌లో 12.45 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. నాన్‌స్టాప్‌గా వర్షం పడడంతో అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్ లాంటి ఏరియాల్లో మెయిన్‌రోడ్లు నదులను తలపించాయి. చాలాచోట్ల నడుం, పీకల్లోతు నీళ్లు రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులు, ట్రాఫిక్పోలీసులు బారికేడ్లను అడ్డం పెట్టి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పైనుంచి వర్షం.. కింద ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు నరకయాతన అనుభవించారు. పలుచోట్ల రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. టూవీలర్లు కొట్టుకుపోయాయి. స్కూల్స్ వదిలే టైం కావడంతో పాఠశాలల బస్సులన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి. అత్యధిక జన సంచారం ఉండే గచ్చిబౌలి ఖాజాగూడ ల్యాంకోహిల్స్సర్కిల్దగ్గర, సికింద్రాబాద్ప్రాంతాల్లో చెట్లపై పిడుగులు పడడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. 3.30 గంటలకు మొదలైన వాన చివరకు 6: 30 గంటల తర్వాత తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
ఐటీ కారిడార్ ఆగమాగం..
ఐటీ కారిడార్పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, ఖాజాగూడ, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో వర్షానికి రోడ్లన్నీ మునిగిపోయాయి. ఐటీ ఉద్యోగులు ఆఫీసు సమయం ముగిసి ఒకేసారి బయటకు రావడంతో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఐకియా నుంచి జేఎన్టీయూ రూట్, గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్, గచ్చిబౌలి నుంచి షేక్పేట్వెళ్లే మార్గంలో వాహనాలన్నీ నిలిచిపోయాయి. సైబర్ టవర్స్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఆల్టర్నెట్ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచనలు చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన వర్షపునీటిని మోటార్ల సాయంతో తొలగించి, క్లియర్చేయడంతో మెల్లిమెల్లిగా వాహనాలు ముందుకు కదిలాయి.
చుక్కలు చూసిన వాహనదారులు
బేగంపేట ఎయిర్‌పోర్టు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్‌పల్లిలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీటిలో కార్లు సైతం సగం మేర మునిగిపోయాయి. అమీర్‌మీట్ మెట్రో ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. మైత్రీవనం వద్ద భారీ వరద చేరడంతో మెట్రో స్టేషన్ కింద నడుం వరకు నీళ్లు వచ్చాయి. స్వర్ణ జయంతి కాంప్లెక్స్దగ్గర కూడా భారీగా నీళ్లు నిలవడంతో వాహనాలు కదల్లేదు. విద్యార్థులు ఆ నీళ్లలో సాహసం చేస్తూ నడుచుకుంటూ వెళ్లారు. పంజాగుట్ట చౌరస్తా నుంచి బేగంపేట వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు నిదానంగా కదిలాయి. నిమ్స్ నుంచి బంజారాహిల్స్‌వైపు వెళ్లే దారిలో కరెంట్ఆఫీసు వద్ద ట్యాంకర్‌పై ఓ చెట్టు విరిగి పడింది. దీంతో భారీగా ట్రాఫిక్జామ్ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి విరించి సిగ్నల్ వైపు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దాటేందుకు గంటన్నర సమయం పట్టింది. కూకట్‌పల్లి అల్విన్ కాలనీ తులసీనగర్‌లో వరద నీటిలో రెండు బైక్ లు కొట్టుకువచ్చాయి. ఎర్రగడ్డ జాతీయ రహదారిపై కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీడిమెట్ల బస్ డిపోవద్ద నర్సాపూర్ మెయిన్‌రోడ్డుపై, సూరారం చౌరస్తా వద్ద, గాజుల రామారం చిత్తారమ్మ దేవాలయం వద్ద భారీగా వరద చేరింది.
పిడుగుల వాన
ఖాజాగూడ ల్యాంకో హిల్స్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలోని తాటి చెట్టుపై పిడుగు పడింది. దీంతో వర్షంలోనూ చెట్టు కాలిపోయింది. భారీ శబ్దంతో పిడుగు పడడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు భయపడి.. వెహికల్స్ వదిలేసి పరుగులు తీశారు. స్థానికులు తమపై కూడా పిడుగుల పడతాయని భయంతో వణికిపోయారు. కంటోన్మెంట్ ఏరియాలోనూ ఓ చోట చెట్టుపై పిడుగు పడింది. దీంతో అక్కడి జనాలు భయాందోళనకు గురయ్యారు.
ఈ సీజన్‌లో ఇదే అత్యధికం
ఈ వర్షాకాలం సీజన్ లో సోమవారం అత్యధిక వర్షపాతం నమోదైంది. కేవలం3 గంటల వ్యవధిలోనే వర్షం బీభత్సం సృష్టించడంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. వర్షం అకస్మాత్తుగా కురవడంతో హైడ్రా బృందాలకు సైతం పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం కష్టమైంది. వర్షానికి సిటీలోని మొత్తం 166 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అయినట్లు జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు వచ్చాయి. అధికారులు అక్కడికి చేరుకొని, నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు.
ప్రాంతం వర్షపాతం(సెంటీ మీటర్లు)
కుత్బుల్లాపూర్ 15.15
బంజారాహిల్స్ 12.45
ఖైరతాబాద్ 11.70
శ్రీగర్ కాలనీ 10.63
కూకట్ పల్లి 10.20
మైత్రివనం 9.28
బాలానగర్ 8.60
బహదూర్ పురా 7.98