షీ--టీమ్స్ హెడ్ కానిస్టేబుల్ మిస్సింగ్

షీ--టీమ్స్ హెడ్ కానిస్టేబుల్ మిస్సింగ్
  • పోలీసు వర్గాల్లో కలకలం
  • అమ్మాయి ఫోన్  నంబర్ కోసం డీసీపీ గన్​మెన్ వేధింపులు!
  • అందరి ముందూ తిట్టడంతో మనస్తాపం
  • ట్యాంక్ బండ్  రైలింగ్ ఎక్కి దిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు

సైఫాబాద్, వెలుగు: హైదరాబాద్  ఉమెన్  సేఫ్టీ వింగ్​లోని షీ-–టీమ్స్  విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్  సురేశ్ అదృశ్యం కావడం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో డ్యూటీలో ఉన్న ఆయన.. తన కార్యాలయంలోనే బైక్ తాళాలు, లంచ్ బాక్స్​ను టేబుల్​పై వదిలి నడుచుకుంటూ బయటకు వెళ్లారు. రాత్రి వరకు ఆయన ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన సురేశ్  భార్య రూప అధికారులను సంప్రదించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీను 
పరిశీలించగా.. సురేశ్  ట్యాంక్ బండ్  వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. ఆయన ట్యాంక్ బండ్  దాటి హైడ్రా కార్యాలయం వరకు వెళ్లిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. మధ్యమధ్యలో ట్యాంక్ బండ్  రైలింగ్ ఎక్కి చుట్టూ పరిశీలించి, తిరిగి కిందకు దిగుతున్నట్లు కనిపించింది. అయితే, హైడ్రా కార్యాలయం దాటిన తర్వాత అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆయన ఎటు వె ళ్లారనేది తెలియడం లేదు. 

ముమ్మరంగా గాలింపు

కానిస్టేబుల్ సురేశ్  అదృశ్యం వెనుక ఉన్నతాధికారుల వేధింపులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక యువతి ఫోన్  నంబర్ ఇవ్వాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ గన్​మెన్  ఒత్తిడి చేయగా, అది నిబంధనలకు విరుద్ధమని సురేశ్  నిరాకరించడంతో అందరి ముందూ ఆయనను దూషించినట్లు సమాచారం.

ఈ వేధింపులపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేశ్.. తన ఉద్యోగానికి రాజీనామా లేఖ సమర్పించినట్లు తెలుస్తోంది. అధికారుల నుంచి స్పందన లేకపోవడం వల్ల ఏర్పడిన మానసిక ఒత్తిడితోనే ఆయన వెళ్లిపోయారని భావిస్తున్నారు. ప్రస్తుతం సైఫాబాద్  పోలీసులు మిస్సింగ్  కేసు నమోదు చేసి ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.