V6 News

ఇది తింటే మంచానికే పరిమితం.. కళ్లు బైర్లు కమ్మే న్యూస్

ఇది తింటే మంచానికే పరిమితం.. కళ్లు బైర్లు కమ్మే న్యూస్

అల్లం వెల్లుల్లి పేస్ట్‌.. ఇది లేనిదే ఎలాంటి కూరలు వండలేం. బిర్యాని, చికెన్, మటన్ తో పాటు శాఖాహారులు కూడా  ఎన్నోరకాల వంటకాల్లో ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్  వాడతారు. ఇది లేకపోతే అస్సలు పని అవ్వదు. దీనిని ఆసరాగా చేసుకున్నారు కొందరు కల్తీ రాయుళ్లు. మొన్న ఐస్క్రీమ్, నేడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌. గుట్టు చప్పుడు కాకుండా జనాలు తినే ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్లో కొందరు కేటుగాళ్లు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ విక్రయిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కాటేన్ పారిశ్రామిక వాడలో కొందరు నిర్వాహకులు కల్తీ వెల్లుల్లి పేస్ట్‌ ను విక్రయిస్తున్నారు.

 కెమికల్స్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ

తక్కువ ధరకే వీటిని అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లితో పాటు రసాయనాలను వాడి కల్తీ పేస్ట్ను తక్కువ ధరకే అమ్ముతున్నారు.   ఈ దందా  కొన్నేళ్ల నుంచి గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆ కంపెనీపై దాడులు చేశారు. పోలీసుల దాడుల్లో వారికి దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. మిషన్లలో కుళ్లిపోయిన అల్లం,వెల్లుల్లి పేస్ట్‌, మురుగు నీరు ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఏకంగా 500 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్, భారీగా మ్యాంగో కూల్ డ్రింక్స్, ప్రమాదకరమైన రసాయనాలు, మనుషుల ప్రాణాలు తీసే తెల్లటి పౌడర్, 210 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 550 కేజీల నాన్ వెజ్ మసాల ప్యాకెట్స్, ఒక టన్ను వెల్లుల్లిని సీజ్ చేశారు. ఈ కల్తీ దందాను నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


రాజ్యమేలుతున్న కల్తీ రాయుళ్లు


అల్లం వెల్లుల్లి పేస్ట్‌ చీప్‌గా వస్తుందని టెంప్ట్ అవుతున్నాం. ఇలా చేస్తూ చేజేతులా మనం రిస్క్‌లో పడుతున్నాం. కల్తీ అల్లం వెల్లుల్లి, కల్తీ పాలు, కల్తీ ఐస్‌క్రీమ్‌లు, కల్తీ చాక్లెట్లు.. చిన్న పిల్లలు తింటారన్న ఇంగితం కూడా  లేదు.. ప్రాణాలు పోతాయన్న ఆలోచన అసలే లేదు.. గల్లాపెట్టె నిండాలన్న కక్కుర్తితో కొంతమంది కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న నకిలీలలు.. జనాన్ని వణికిస్తున్నాయి. ఏది తినాలి.. ఏది తినకూడదన్న ఆలోచనలో పడిపోతున్నారు. కాదేదీ కల్తీకి అనర్హం అంటూ కల్తీ రాయుళ్లు మనం తినే ఆహార పదార్ధాలను యధేచ్చగా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కందిపప్పులో కేసరి పప్పు.. పాలు చిక్కగా కన్పించేందుకు బియ్యం పిండి కలుపుతున్నారు. శనగపిండి, ధనియాల పొడి, కారం పొడి, వక్కపొడి, నెయ్యి, పంచదార, ఐస్‌క్రీమ్‌, చాక్లెట్లు, కాఫీ, టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంటనూనెలు ఇలా మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలోనూ కల్తీ రాజ్యమేలుతోంది.