
Hyderabad Tech News: కార్పొరేట్ ఉద్యోగం అంటే ఎంత ఒత్తిడితో కూడుకుని ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఒకపక్క టార్గెట్లు, మీటింగ్ లు, ప్రాజెక్ట్ పనులు అంటూ ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు ఉరుకులు పరుగులతో కాలం గడుపుతుంటారు. ఇది వారిని మరింత ఒత్తిడికి లోనయ్యేలా చేస్తుంటుంది. అయితే అలాంటి ఒత్తిడి సమయంలో చిన్న బ్రేక్, స్ట్రెస్ తగ్గించటానికి ప్రయత్నించటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
ఈ క్రమంలోనే హైదరాబాదుకు చెందిన ఒక ఐటీ స్టార్టప్ కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. పనివేళల్లో ఒత్తిడి నుంచి తమ ఉద్యోగులు ఉపశమనం పొందేందుకు చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ ని నియమించింది. ఇందులో కొత్తేముంది అంటారా.. కానీ ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇందుకోసం కంపెనీ డెన్వర్ అనే గోల్డెన్ రిట్రీవర్ కుక్కను ఆ పాత్రలో నియమించింది. ప్రస్తుతం హార్వెస్టింగ్ రోబోటిక్స్ సంస్థ రైతులకు లేజర్ టెక్నాలజీ ఉపయోగించి కలుపు తీసే సాంకేతికత పరిష్కారాలను అందిస్తోంది.
దీనికి సంబంధించిన వివరాలను హార్వెస్టింగ్ రోబోటిక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ తన లింక్డిన్ ఖాతాలో పంచుకున్నారు. తాము చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసరుగా చేర్చుకున్న డెన్వర్ కోడింగ్ చేయదని, కేవలం అక్కడి ఉద్యోగుల హృదయాలను దొంగిలిస్తుందని అన్నారు. అలాగే ఒత్తిడి నుంచి ఉద్యోగులకు రిలీఫ్ ఇవ్వటంతో పాటు వారిలో ఎనర్జీని నింపటంలో రోజంతా డెన్వర్ బిజీగా ఉండనుందని వెల్లడించారు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల ఎమోషన్లతో పాటు వారి ఆరోగ్యం పట్ల కంపెనీలు దృష్టి చూపాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. దీనిపై కొందరు నెట్టింట సంతోషకరమైన కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
ఇప్పటికే గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఆఫీసుల్లో పెట్ ఫ్రెండ్లీ పాలసీలను చాలా కాలం కిందటి నుంచే అమలు చేస్తున్నాయి. హ్యూమన్ యానిమల్ బాండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. పెంపుడు జంతువులకు అనుకూలమైన కార్యాలయాల్లోని 91% మంది ఉద్యోగులు ఎక్కువగా నిమగ్నపై పనిచేస్తున్నారని, 87% మంది తమ యజమానితోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడైంది.