బషీర్‌బాగ్, వెలుగు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో భారీ ట్రాఫిక్ ఏర్పడే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు నగరవ్యాప్తంగా సమగ్ర ట్రాఫిక్ అడ్వైజరీని గురువారం విడుదల చేశారు. జనవరి 9 నుంచి 13 వరకు ట్రాఫిక్ అధికంగా ఉండనుందని, అలాగే జనవరి 16 నుంచి 19 మధ్య ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల వైపు పెద్దఎత్తున ప్రయాణాలు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్ – ఆరాంఘర్ కారిడార్, ఎస్‌ఆర్‌నగర్ – లక్డికాపూల్, రేతిబౌలి – ఆరాంఘర్(అత్తాపూర్ మార్గం), కాచిగూడ – రామంతపూర్, ఎంజీబీఎస్ – దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, పాదచారుల రాకపోకలతో తీవ్ర రద్దీ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 90102 03626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) డి.జోయెల్ డేవిస్ సూచించారు.
