- ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- 7 కిలోమీటర్ల మేర ఆక్రమణల తొలగింపు
- రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం
- బస్సుల్లో బల్దియా, పోలీస్ కమిషనర్ల ఫీల్డ్ విజిట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: షేక్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద రోజూ ఉదయం, సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. చిన్నపాటి వర్షం పడితే చాలు గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ఆ ప్రభావం టోలిచౌకి, నానల్ నగర్, రేతిబౌలి, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్ వరకు పడుతోంది. అటు రాయదుర్గ్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, లింగంపల్లి వెళ్లే వారికి తిప్పలు తప్పడం లేదు. ఈ సమస్యను గుర్తించిన జీహెచ్ఎంసీ, ట్రాఫిక్పోలీసులు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ముఖ్యంగా మాసాబ్ ట్యాంక్ నుంచి షేక్‌పేట్ ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ రూట్‌ను మోడల్ కారిడార్‌గా తీర్చిదిద్దిందుకు ప్లాన్లు రూపొందిస్తున్నారు.
ఫీల్డ్ విజిట్ చేసిన కమిషనర్లు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం ఉన్నతాధికారులతో ట్రాఫిక్సమస్య ఎలా ఉందో తెలుసుకునేందుకు బస్సు జర్నీ చేశారు. ముందు షేక్ పేట్ వద్ద పరిశీలించిన తర్వాత టోలిచౌకికి వెళ్లి అక్కడి నుంచి బస్సులో మాసబ్ ట్యాంక్ మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ –12లో ఉన్న అగ్రసేన్ జంక్షన్ వరకు వచ్చారు. ఈ సందర్భంగా దారిలో ఉన్న ట్రాఫిక్ అడ్డంకులు ఏమిటి? వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నాయా? అనేవి తెలుసుకున్నారు.
కరెంట్ స్తంభాలు, చెట్లు తొలగింపు
షేక్పేట్టు మసాబ్ట్యాంక్రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా 7 కిలోమీటర్ల మేర ఆక్రమణలున్నట్టు గుర్తించారు. ఈమేరకు త్వరలో వీటి తొలగింపునకు చర్యలు తీసుకోనున్నారు. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పూడికతీత పనులు వేగవంతంగా చేయాలని నిర్ణయించారు. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న కరెంట్‌స్తంభాలు, చెట్లు, ఇంకా ఏవి అడ్డుగా ఉన్నా తొలగించాలని ఆదేశించారు.
అడ్డంకులున్నీ అవుట్...
ఈ రూట్లో జంక్షన్ల అభివృద్ధితో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మించనున్నారు. మెహిదీపట్నంలోని సరోజినిదేవి హాస్పిటల్ వద్ద, బృందావన్ కాలనీ రోడ్ నంబర్1 వద్ద కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని నిర్ణయించారు. షేక్‌పేట్ నాలా వద్ద పెలికాన్ సిగ్నల్, జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయనున్నారు. నానల్ నగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అక్కడ ఉన్న రోటరీ (రోడ్డు మధ్యలో స్థలం) వెడల్పు తగ్గించి రోడ్డుని విస్తరించనున్నారు. రేతిబౌలి నుంచి నానల్ నగర్ వరకు ఉన్న సెంట్రల్ మీడియన్‌ను, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించనున్నారు.
ఎన్ఎండీసీ, డెల్ స్టోర్ ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం భూసేకరణ చేపట్టి రోడ్డు విస్తరించనున్నారు. నానల్ నగర్ వద్ద ఉన్న రామాలయం ఆర్చ్, బొడ్రాయి, షేక్‌పేట్ నాలా సమీపంలోని సమాధులను తొలగిస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, వార్నింగ్బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మెహదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి రోడ్ నెంబర్12 కు నేరుగా వెళ్లేలా స్లిప్ రోడ్డును
డెవలప్చేయనున్నారు.
ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తం
సిటీలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేసేందుకు ప్రతి జోన్‌కు రూ. 20 కోట్ల చొప్పున రూ. 120 కోట్లు కేటాయిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను రెండేండ్లలో పూర్తి చేస్తామన్నారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా వెంటనే చేయాల్సిన పనులతో పాటు స్లోగా చేసే పనులను గుర్తించామన్నారు. ఖైరతాబాద్, గోల్కొండ జోనల్ కమిషనర్లు ప్రియాంక అలా, ముకుంద్ రెడ్డి, జాయింట్ సీపీ ట్రాఫిక్ డి జోయల్ డేవిస్ పాల్గొన్నారు.
