V6 News

వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా జరగలే.. ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నరు

వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా జరగలే.. ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నరు
  •     అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ లీడర్లు  
  •     కమిషనర్​కు వినతి పత్రం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా జరగడం లేదని, ఎంఐఎంకు అనుకూలంగా పునర్విభజన చేస్తునట్లు  కనిపిస్తోందని బీజేపీ లీడర్లు ఆరోపించారు. బల్దియా ఆఫీసులో కమిషనర్ ఆర్వీ కర్ణర్​ను గురువారం బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, చింతల రామచంద్రారెడ్డి నేతృత్వంలోని బృందం  కలిసింది. వార్డుల విభజన, విలీన ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. డీలిమిటేషన్ పై ప్రజాభిప్రాయాలు తీసుకోకుండానే ఏకపక్షంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 650 చ.కి పరిధి ఉన్న గ్రేటర్​ను ఏకంగా 2 వేల కిలోమీటర్లకు పెంచేప్పుడు, ప్రజల అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఒక వర్గానికి న్యాయం చేసేందుకే ఇదంతా చేశారని  మండిపడ్డారు. వార్డులకు సంబంధించిన మ్యాపులు ఎక్కడా లేవని, వెంటనే మ్యాపులు, పాత 150 వార్డుల జనాభా, కొత్త వార్డుల ఓటర్ల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్క పార్టీ కోసం నియోజకవర్గ సరిహద్దు మార్చడం మంచిది కాదని, కొత్త డివిజన్ల డీలిమిటేషన్ ఒక్క వర్గానికి, ఒక్క పార్టీకి మంచి చేయడానికి చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. 

బాహుబలి సినిమానా? 

విలీనం ఏమన్నా బాహుబలి పార్ట్-–1  సినిమానా అని చింతల రామచంద్రారెడ్డి కమిషనర్​ను ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారం ఎలా వేస్తారో చెప్పాలన్నారు. తాము ప్రత్యేక కమిటీలు వేసుకుని, ఈ నెల 17లోపు కమిషనర్‌‌కు నివేదిక అందజేస్తామన్నారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ఎప్పుడూ మహానగరాన్ని మంచి నగరంగా చూడాలనుకుంటుందని, కానీ ఈ ప్రభుత్వం నిరంకుశంగా విలీన నిర్ణయం తీసుకుందన్నవారు.


రెండో రోజు 6 అభ్యంతరాలు

జీహెచ్‌‌ఎంసీ వార్డుల డీలిమిటేషన్​పై రెండో రోజు గురువారం 57 సర్కిల్ ఆఫీసులు, 6 జోనల్ ఆఫీసులు, హెడ్ ఆఫీసులో అభ్యంతరాలు స్వీకరించారు. హెడ్ ఆఫీసులో 6 అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో 125 గండిపేట్, 126 కోకాపేట్ వార్డుల విభజనపై కోకాపేట్ మాజీ సర్పంచ్ ముంగి జైపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసి, సరిహద్దుల సవరణ కోరారు. శంకర్‌‌పల్లి-హైదరాబాద్ రోడ్డును సరిహద్దుగా చేయాలని, అవసరమైతే క్షేత్రస్థాయి తనిఖీ చేసి ప్రైమరీ నోటిఫికేషన్‌‌కు సవరణ జారీ చేయాలని కోరారు.