హైదరాబాద్‌సిటీ, వెలుగు: వేసవిలో నీటి సమస్యలు రాకుండా 12 సర్కిళ్లలో ఒక్కొక్క సర్కిల్ కి ఒక సీజీఎంను నోడల్ ఆఫీసర్ గా నియమించామని వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి తెలిపారు. వీరు ఇప్పటివరకు మంజూరు చేసిన మంచినీరు, సీవరేజ్ పనులను మార్చి 31 నాటికి పూర్తి చేసేలాగా యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకోవాలని వారికి సూచించారు. వేసవి కార్యాచరణపై అశోక్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
దీనికి ఈడీ మయాంక్ మిట్టల్, డైరెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వాటర్బోర్డు పనుల కోసం తవ్విన రోడ్లను ఏప్రిల్ చివరి వారంలోగా పునరుద్ధరించాలని ఆదేశించారు. వేసవిలో 24 గంటల్లో ట్యాంకర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, పర్సనల్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్, ఆపరేషన్ డైరెక్టర్ వినోద్ భార్గవ పాల్గొన్నారు.
కాకతీయ హిల్స్‌లో కనెక్షన్ లు కట్
ఓ అండ్ ఎం డివిజన్–-15 పరిధి కాకతీయ హిల్స్ లో కొంత మంది అపార్ట్మెంట్ యజమానులు బోర్డు అనుమతి లేకుండానే సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్ తీసుకున్నారు. దీంతో పాటు వాటినుంచి నుంచి వచ్చే అధిక సీవరేజ్ వల్ల మెయిన్ రోడ్ పై తరచూ సీవరేజ్ ఓవర్ ఫ్లో అయ్యేది. ఇటీవల స్థానిక అధికారులు పర్యటించిన సమయంలో ఈ విషయం బయటపడటంతో ఎండీ అశోక్ రెడ్డిఆదేశాల మేరకు మంగళవారం నాలుగు అపార్ట్మెంట్ సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్ ను తొలగించారు. మరో నాలుగు భవన యజమానులకు నోటీసులు జారీ చేశారు.
