ఎల్నినో ఎఫెక్ట్..కాలేజీలకు ముందస్తు దీపావళి సెలవులు

ఎల్నినో ఎఫెక్ట్..కాలేజీలకు ముందస్తు దీపావళి సెలవులు
  • హైదరాబాద్ ​సిటీని వెంటాడుతున్న తీవ్ర నీటి ఎద్దడి
  • పలు కాలేజీలు, అకాడమీల్లో మొదలైన ఆన్‌‌లైన్ క్లాసులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌లో నీటి కష్టాలు విద్యాసంస్థలనూ తాకాయి. ఎల్‌‌నినో ప్రభావంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటంతో రెసిడెన్షియల్ క్యాంపస్‌‌లు, ప్రైవేట్ కాలేజీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వేలాది మంది విద్యార్థులున్న హాస్టళ్లకు రోజూ సరిపడా నీటిని సమకూర్చడం యాజమాన్యాలకు భారంగా మారింది. దీంతో దీపావళికి ముందే సెలవులు ప్రకటిస్తున్నాయి. నగరంలోని పలు ప్రముఖ విద్యాసంస్థలు, అకాడమీలు మంగళవారం అత్యవసర సర్క్యులర్లు జారీ చేశాయి.

బుధవారం నుంచి సెలవులు అమల్లోకి రానుండగా, దీపావళి వరకు ఆన్‌‌లైన్ క్లాసులు నిర్వహించనున్నట్లు వెల్లడించాయి.నగరవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటడం, వాటర్ బోర్డు సరఫరా సరిపోకపోవడంతో ఐటీ కారిడార్ సహా పలు ప్రాంతాల్లోని హాస్టళ్లు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్యాంకర్లు కూడా సమయానికి దొరకడం లేదు. దీంతో ఓ పెద్ద జేఈఈ అకాడమీ మంగళవారం సాయంత్రం నుంచే విద్యార్థులను ఇళ్లకు పంపడం మొదలుపెట్టింది.

దీపావళి సెలవుల అనంతరం క్యాంపస్‌‌లను ఎప్పుడు తెరుస్తారో పండుగకు ముందే పేరెంట్స్‌‌కు సమాచారం ఇస్తామని యాజమాన్యం తెలిపింది.  నీటి కొరత కారణంగా విద్యార్థులను ఇళ్లకు పంపి ఆన్‌‌లైన్ క్లాసులు నిర్వహించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కాదు. గతంలో నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలోనూ తీవ్ర నీటి ఎద్దడి తలెత్తింది. దీంతో క్యాంపస్ సెలవులను పొడిగించి, కొద్దిరోజుల పాటు ఆన్‌‌లైన్ క్లాసులు నిర్వహించారు.