
- 48 గంటలు తేలికపాటి వానలకు చాన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ సిటీలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో వాతావరణం మారిపోయింది. పలుచోట్ల గాలులలో కూడిన వర్షం కురిసింది. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్ లో అత్యధికంగా 13.3 మిల్లీమీటర్లు, హఫీజ్ పేటలో 11.8, కూకట్ పల్లిలో 9.3, మూసాపేటలో 9, గాజులరామారంలో 5.5, మాదాపూర్ లో 3.5, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కూకట్ పల్లి, కేపీహెచ్ బీ కాలనీ, నిజాంపేట, మూసాపేట, బాలానగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, అశోక్ నగర్, బీహెచ్ఈఎల్, కొండాపూర్, రాయదుర్గం, మియాపూర్ ఏరియాల్లో వర్షం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలహీనపడడంతో రెండు మూడు రోజులుగా సిటీలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కొడంగల్‌లో గాలివాన బీభత్సం
కొడంగల్: కొడంగల్‌లో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. హైదరాబాద్– బీజాపూర్నేషనల్హైవే163పై భారీ హోర్డింగ్కుప్పకూలింది. దీంతో చాలాసేపు ట్రాఫిక్స్తంభించింది. బస్ స్టాండ్‌లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డు నేల కూలింది. బోంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. వరి, మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.