వరల్డ్ సెయిలింగ్‌‌లో హైదరాబాద్ కుర్రాళ్ల సత్తా

వరల్డ్ సెయిలింగ్‌‌లో హైదరాబాద్ కుర్రాళ్ల సత్తా

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌కు చెందిన యంగ్‌‌ సెయిలర్లు దండు వినోద్,  నిరుడు బద్రీనాథ్ వరల్డ్  చాంపియన్‌‌షిప్‌‌లో సత్తాచాటారు. ఇటీవల చెక్ రిపబ్లిక్‌‌లోని లేక్ లిప్నోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో 14 ఏండ్ల ఈ ఇద్దరు సెయిలర్లు అండర్-17 క్యాడెట్ క్లాస్‌‌లో ఆకట్టుకున్నారు. ఏడు యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, ఇండియా నుంచి వచ్చిన 104 బోట్లలో పోటీపడి ఓవరాల్‌‌గా 14వ స్థానంలో నిలిచి మెప్పించారు.  

మొత్తం 12 రేసుల్లో రెండు సార్లు సింగిల్-డిజిట్ స్థానాలను సాధించారు, అందులో ఒక రేసులో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.సికింద్రాబాద్‌‌లోని గవర్నమెంట్ స్కూల్స్‌‌కు చెందిన వినోద్‌‌, బద్రీనాథ్ యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. హెడ్ కోచ్ సుహీమ్ షేక్, మాజీ నేషనల్ చాంపియన్ అయ్యాజ్ షేక్ పర్యవేక్షణలో కేవలం రెండు నెలల కఠిన శిక్షణతోనే వరల్డ్ చాంపియన్‌‌షిప్‌‌కు అర్హత సాధించడం విశేషం. 

ఈ టోర్నీ తర్వాత వినోద్, బద్రీనాథ్ తమ తదుపరి లక్ష్యాలపై దృష్టి పెట్టారు. 2026 జులైలో ఇటలీలో జరగబోయే తదుపరి వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌తో పాటు ఆసియా గేమ్స్‌‌  కోసం ట్రెయినింగ్‌‌కు రెడీ అవుతున్నారు.