- 16 ఏండ్ల బాలికపై అత్యాచారం
- న్యూడ్ ఫొటోలు తీసి, బెదిరించి పలుమార్లు లైంగిక దాడి
- 2019లో ఘటన.. తాజాగా నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్ సిటీ, వెలుగు: 16 ఏండ్ల బాలికను.. 18 ఏండ్ల యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి, తర్వాత బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. 2019లో కేసు నమోదు కాగా, తాజాగా నిందితుడికి నాంపల్లి 12వ అడిషనల్మెట్రోపాలిట్ సెషన్స్ కోర్టు 25 ఏండ్ల జైలు శిక్షతో పాటు, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. కేసుకు సంబంధించిన వివరాలను షీ టీమ్స్ సీపీ లావణ్య వెల్లడించారు. హైదరాబాద్ సిటీలోని ఓ కాలేజీలో బాధిత బాలిక, సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న దోషి ఆకాశ్ కుమార్ చదువుతున్నారు. బాలిక జూనియర్కాగా, ఆకాశ్ సీనియర్.
ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడీని ఫాలో అయిన ఆకాశ్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. రోజూ అతడు పంపే మెసేజ్‌లు, కేర్నెస్, పొగడ్తలకు ఆ బాలిక పొంగిపోయేది. ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఆకాశ్.. నమ్మించి మరింత దగ్గరయ్యాడు. ఒక రోజు ఆమె న్యూడ్ ఫొటోలు తీశాడు. తర్వాత డబ్బులు అడగడం ప్రారంభించాడు. మొదట్లో ఆమె ఫ్రెండ్లీగా ఇచ్చినప్పటికీ, తర్వాత డబ్బుల కోసం వేధించడం ప్రారంభించాడు.
తన దగ్గర లేవని చెప్తే.. న్యూడ్ ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. చేసేదేమీ లేక ఆమె తన ఇంట్లోనే చోరీలు చేసేది. న్యూడ్ ఫొటోలను అడ్డంపెట్టుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక సరిగ్గా కాలేజీకి రావడం లేదంటూ యాజమాన్యం ఆమె పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. బాలికను ఆరా తీయగా.. విషయం చెప్పింది. పేరెంట్స్ లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, బాలికను భరోసా సెంటర్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.
అక్కడే మెడికల్ ఎవిడెన్స్ సేకరించారు. తర్వాత పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసి 2020లో కోర్టులో చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 25 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్న బాధితురాలు తీర్పు విషయం తెలుసుకుని ఎంతో సంతోషించిందని షీ టీమ్స్ డీసీపీ లావణ్య తెలిపారు.
