వానాకాలానికి హైడ్రా రెడీ...ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో పనులు స్పీడప్

వానాకాలానికి హైడ్రా రెడీ...ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో పనులు స్పీడప్
  • లాగ్​ ఏరియాలపై హైడ్రా కమిషనర్ దృష్టి 
  • వానలు వచ్చేలోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయం
  • మాన్సూన్ టీమ్స్​కు టెండర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: మరో 20 రోజుల్లో వానాకాలం ప్రారంభం కానుండగా, ఇప్పటినుంచే హైడ్రా సిద్ధమవుతోంది. భారీ వర్షాలు కురిసిన కూడా సిటీ జనం ఆగమాగం కావొద్దని ముందుగానే ప్లాన్ చేస్తోంది. వర్షపునీరు నిలవకుండా ఉండేందుకు పనులన్నీ వేగవంతం చేసింది. సిటీలో ఎక్కడెక్కడ నీళ్లు ఆగుతున్నాయి? ఎక్కడ రోడ్లు చెరువులవుతాయన్న వివరాలు సేకరించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నీరు పోయే దారిని క్లియర్ చేయడం, నాలాల దగ్గర అడ్డంకులను తొలగించడం లాంటి పనులను కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోకుండా, వరద నీరు సాఫీగా వెళ్లేలా పనులు వేగవంతం చేశారు. ఎక్కడైనా నీరు ఆగిపోయే అవకాశం ఉందంటే.. అక్కడ ఇప్పటి నుంచే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. గతంలో మొదలు పెట్టిన పనులు కూడా వేగవంతం చేస్తున్నారు. జనానికి ఇబ్బంది కలగకుండా చూడటమే మా ఫస్ట్ ప్రయారిటీ అని హైడ్రా అధికారులు చెప్తున్నారు.

ఈ ఏడాది కూడా 150 టీమ్స్...

ఎక్కడ చెట్టు విరిగినా.. ఎక్కడ డ్రైనేజీ పొంగినా నిమిషాల్లోనే వచ్చేందుకు ఈసారి కూడా 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయి. వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను హైడ్రా అధికారులు మొదలుపెట్టారు. వచ్చే నెల నుంచి టీమ్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రతి టీమ్ దగ్గర వాటర్ పంపింగ్ మోటార్లు, కట్టర్లు ఉండనున్నాయి. ముంపు ప్రాంతాల్లో 24 గంటల పాటు ఈ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఈ టీమ్స్ కాకుండా హైడ్రా వద్ద 51 డీఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ టీమ్స్ వేగంగా స్పందించి క్షణాల్లోనే స్పందిస్తున్నాయి.

ఈసారి ముందస్తుగా టెండర్లు..

గతేడాది నుంచి డీ-సిల్టింగ్, మాన్సూన్ టీమ్స్ బాధ్యతలను హైడ్రాకు ప్రభుత్వం అప్పగించింది. అంతకుముందు ఈ బాధ్యతలను జీహెచ్ఎంసీ చూసేది. లాస్ట్ ఇయర్ వీటికి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో బాధ్యతలన్నీ ఒక్కసారిగా హైడ్రాకు అప్పగించింది. దీంతో టీమ్స్ ఫీల్డ్ లోకి వచ్చేందుకు ఆలస్యమైంది. జూన్ చివర్లో టీమ్స్ వచ్చాయి. 

ఈసారి అలా కాకుండా ముందుగానే టెండర్లు వేశారు. వానలు పడే సరికి టీమ్స్ ఫీల్డ్ లోకి రానున్నాయి. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగి పనులను పర్యవేక్షిస్తున్నారు. వానలు పడకముందే పనులన్నీ పూర్తి కావాలని, ఎక్కడ గ్యాప్ ఉన్నా ఊరుకునేది లేదని అధికారలకు వార్నింగ్ ఇచ్చారు. వర్షపు నీరు నిలిచే చోట కొత్త పైప్​లైన్లు వేయడం, నాలాల క్లీనింగ్ పనులపై ఆయన సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇప్పటికే దాదాపు డీ-సిల్టింగ్ పనులు పూర్తయ్యాయి.